కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఫొటో సోర్స్, ANI
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిధుల గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సమాధానమిచ్చారు.
సీజేపీ ప్రతినిధులు జూన్ 3న పార్టీ తొలి మీడియా సమావేశం నిర్వహించారు.
జూన్ 6న సీజేపీ చేయాలనుకుంటున్న శాంతియుత నిరసనకు సంబంధించి ఈ మీడియా సమావేశం జరిగింది.
సీజేపీకి నిధుల కేటాయింపు గురించి సౌరవ్ దాస్‌ను అడగ్గా, దానికి ఆయన "నిధులు దేనికి?" అని ప్రశ్నించారు.
"ఈ పోస్టర్ విలువ 200 రూపాయలు. ఇక్కడ ఇంత మంది గుమిగూడారు. ప్రతిఒక్కరూ ఒక్కో రూపాయి ఇస్తే 200 రూపాయల విలువైన పోస్టర్ తయారవ్వదా?" అంటూ తన వెనుక ఉన్న పోస్టర్‌ను చూపిస్తూ అన్నారు.

"యువత వీధుల్లోకి వచ్చి జంతర్ మంతర్‌కి రావాలనుకుంటే వంద రూపాయలు ఖర్చుపెట్టి ఆటోరిక్షాలో అక్కడికి రాలేరా? మేమూ అక్కడికి వెళ్తాం. దానికోసం నిధులు ఎందుకు?" అని సౌరవ్ దాస్ అన్నారు.
"ఇది కౌంటర్ నెరేటివ్‌ను నడిపించే ప్రక్రియ. ఒక ఉద్యమం సరైన దారిలో జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక కౌంటర్ నెరేటివ్‌ను సృష్టిస్తారన్నదానికి చరిత్రే సాక్షి. కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు. నిధుల అంశాన్ని తెరపైకి తెస్తారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉందని చెబుతారు. రకరకాల కథనాలు ప్రచారం చేస్తారు. ఉద్యమం సరైన దిశలో ముందుకు సాగుతోంది కాబట్టే ఇలాంటివి చేస్తారు" అని సౌరవ్ దాస్ అన్నారు.
"ఈ ఉద్యమం సరైన దిశలో సాగుతోందని నిర్ధరణ అయింది. అందుకే ఇలాంటి కథనాలు వెలుగులోకి వస్తున్నాయి" అని ఆయన అన్నారు.
జూన్ 6న భారత్‌కు
జూన్ 6న భారత్‌కు వచ్చి శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు 'కాక్రోచ్ జనతా పార్టీ' సోషల్ మీడియా ఉద్యమం వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు.
విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ వారు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు.
అభిజిత్ దీప్కే ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. బోస్టన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
యువత, కాక్రోచ్ గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల తర్వాత 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే సోషల్ మీడియా ఉద్యమం మొదలైంది.
ఈ ఉద్యమం వ్యవస్థాపకుడు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌కు చెందిన అభిజిత్ దీప్కే. ఆయన చాలా ఏళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ బృందంలో పనిచేశారు.

ఫొటో సోర్స్, instagram/cockroachjantaparty
అభిజిత్ దీప్కే ఏమన్నారు?
"విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి నేను నా స్వదేశం భారత్‌కు తిరిగి వస్తున్నా" అని అభిజిత్ దీప్కే అన్నారు.
పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కోసం, లక్షలమంది విద్యార్థుల కష్టాన్ని వృథా చేసినందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చాలా కాలంగా సోషల్ మీడియాలో గొంతు వినిపిస్తున్నామని ఆయన చెప్పారు.
"ఎనిమిది లక్షలమంది విద్యార్థులు మా వినతి పత్రంపై సంతకాలు చేశారు. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి దిల్లీ, లఖ్‌నవూ, జైపూర్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు కూడా జరుగుతున్నాయి. అయినా కూడా వారు దాన్ని పట్టించుకోవడం లేదు" అని అభిజిత్ అన్నారు.
"నీట్ పరీక్షకు 22 లక్షల మంది విద్యార్థులు, సీబీఎస్ఈకి 17 లక్షల మంది విద్యార్థులు, సీయూఈటీకి 16 లక్షల మంది విద్యార్థులు, ఎస్ఎస్సీ జీడీ కి 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా కోటి మందికి పైగా విద్యార్థుల జీవితాలతో వ్యవస్థ ఆటలాడింది. ఈ కారణంగానే విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. దీనికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే" అని అభిజిత్ అన్నారు.
"ఇంత పెద్ద తప్పు జరిగినా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే, దేశంలో బాధ్యత అనేదే మిగల్లేదని అర్థమని అభిజిత్ దీప్కే అన్నారు. దీనివల్ల వ్యవస్థ ఎన్ని తప్పులు చేసినా ఎవరూ ఏమీ చేయలేరన్న సందేశం వెళుతుంది" అని ఆయన చెప్పారు.
"ఇది ఇంకెంతకాలం కొనసాగుతుంది? అందుకే మనమందరం ఏకమై, భారత రాజ్యాంగం చూపిన మార్గాన్ని అనుసరించి, శాంతియుతంగా మన గళాన్ని వినిపించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయాలి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, X/Cockroachisback
"మనం అందరం కలిసికట్టుగా గళం విప్పితే, వారు మన మాటలను అంగీకరించక తప్పదు. నేను జూన్ 6వ తేదీ శనివారం ఉదయం దిల్లీకి రావాలని నిర్ణయించుకున్నా. మీరందరూ నన్ను విమానాశ్రయంలో కలవండి. మనమందరం కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం. అక్కడ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టడానికి వారి అనుమతి తీసుకుందాం" అని అభిజీత్ దీప్కే అన్నారు.
"అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా మన గొంతును వినిపించే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారమే మా స్వరాన్ని వినిపిస్తాం. 'కాక్రోచ్ జనతా పార్టీ'కి మద్దతు ఇచ్చే వారందరూ, అలాగే ఈ వ్యవస్థ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత, విద్యార్థులందరూ ఈ ఉద్యమంలో పాల్గొంటారని నేను ఆశిస్తున్నా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని భావించే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'అరెస్ట్ భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు'
"నన్ను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమోనని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. మన దేశం ఇంకా ప్రజాస్వామ్య దేశంగానే ఉందని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతిస్తారని నేను ఇప్పటికీ ఆశిస్తున్నా" అని అభిజీత్ దీప్కే అన్నారు.
"నేను కోరుకుంటే ఇక్కడే అమెరికాలో పనిచేస్తూ హాయిగా జీవించగలిగేవాడిని. గత కొద్ది రోజులుగా నాకు చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ నేను భారత్‌కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నా దేశాన్ని ప్రేమిస్తున్నా. నా దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. ఈ దేశం వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు మన దేశం కోసం ఏదైనా చేయాల్సిన సమయం వచ్చింది" అని ఆయన అన్నారు.
'కాక్రోచ్' గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావన
రాజకీయ వర్గాల్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే మాట వినిపిస్తోంది. కానీ ఆదివారం కేరళలోని కొట్టాయంలో జరిగిన మలయాళ దినపత్రిక 'దీపిక' 140వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో, ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ కూడా 'కాక్రోచ్' గురించి మాట్లాడారు.
"ప్రజాస్వామ్యంలో ఎలాంటి చర్చనైనా, అభిప్రాయాన్నైనా అయినా ఆశ్చర్యం కలిగించేదిగా పరిగణించకూడదు. దాన్ని ఒక సాధారణ ప్రక్రియలో భాగంగా పరిగణించాలి. ఇలాంటి విషయాలను నిర్వహించడానికి మీడియాకు తగినంత స్వాతంత్య్రం ఉందని నేను భావిస్తున్నా. రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటికి ఆ సామర్థ్యం ఉంది. మన సంస్థలలో ఏదీ బలహీనంగా లేదు" అని ఆయన అన్నారు.

మరోవైపు అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన కొందరు నాయకులు "కాక్రోచ్ జనతా పార్టీ"పై విమర్శలు చేశారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో అభిజీత్ ఉన్న ఫోటోను బీజేపీ లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే, దిల్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో షేర్ చేశారు.
"అభిజిత్ దీప్కే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, అంటే అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్త. బోస్టన్‌కు వెళ్లడానికి అతనికి ఎవరు డబ్బు చెల్లించారు? అతని భోజనం, ఇతర ఖర్చులను సోరోస్ ఫౌండేషన్ భరిస్తోందా? ఇది ప్రతిపక్ష పార్టీలకు ఒక హెచ్చరిక. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు విదేశీ శక్తుల సాయం తీసుకుంటారా?" అని ఆయన ఆ పోస్ట్‌లో రాశారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అభిజీత్ చేసిన కొన్ని ట్వీట్లను ఉటంకిస్తూ ఆయనపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రకటన చేశారు.
ఒక పాత ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, "కాక్రోచ్‌లాంటి అభిజిత్ దీప్కే భారతదేశానికి ఒక ముస్లిం ప్రధానమంత్రిని ఎందుకు కోరుకుంటున్నాడు?" అని బగ్గా రాశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























