‘నా దగ్గర 40 కేజీల బంగారం ఉంది’ అని నెట్‌ఫ్లిక్స్ షోలో ప్రకటించిన ఈ మహిళ ఎవరు?

ఫొటో సోర్స్, NETFLIX
- రచయిత, వందన
- హోదా, బీబీసీ న్యూస్ ఎడిటర్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
"సతీశ్‌తో పెళ్లయినప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం ఆయన కాళ్లకు మసాజ్ చేస్తా. ఆయన ఒక రాజకుమారుడిలా నిద్రలేస్తారు. హిందువుగా ఆయన నమ్మకం ఏంటంటే భార్య ప్రతిరోజూ భర్త కాళ్లను తాకితే లక్ష్మి వస్తుందని"
నెట్‌ఫ్లిక్స్ కొత్త రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ప్రారంభంలోనే ఈ సీన్ వస్తుంది. ఇందులో దుబాయ్‌లో నివసించే భారతీయ బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ సతీశ్ సంపాల్ తెల్లవారుజామున తన భార్య తాబిందాతో పాదాలకు మర్దన చేయించుకుంటూ ఉంటారు.
ఈ ప్రారంభ దృశ్యమే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
'దేశీ బ్లింగ్' అనేది దుబాయ్‌లో నివసిస్తున్న ధనవంతులైన భారతీయుల విలాసవంతమైన జీవితాలు, వారి సంబంధాలు, వ్యాపారాలు, సోషల్ పార్టీలు, రాజకీయాలు, సంక్లిష్టతలను చూపించే ఒక రియాలిటీ షో.
ఈ పాత్రల్లో టీవీ తారలైన తేజస్వి ప్రకాశ్, కరణ్ కుంద్రాతో పాటు జబల్‌పూర్‌కు చెందిన సతీశ్ సంపాల్, ఆయన భార్య తాబిందా కూడా ఉన్నారు.

తాబిందా ఒక పాకిస్తానీ-బ్రిటిష్ మహిళ. కానీ ఆమెకు అనేక గుర్తింపులు ఉన్నాయి. కొందరు ఆమెను ఒక ధనిక పారిశ్రామికవేత్త భార్యగా మాత్రమే చూస్తారు. మరికొందరు ఒక విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తిస్తారు.
సోషల్ మీడియాలో కొందరు ఆమెను ఒక ప్రముఖ సోషలైట్‌గా చూపిస్తున్నారు.
కానీ ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, పితృస్వామ్య భావనలతో నిండి ఉన్నాయని చాలామంది విమర్శించారు.

ఫొటో సోర్స్, NETFLIX
పురుషాధిక్య భావజాలం
ఆమె భర్త చాలామంది అమ్మాయిలతో కనిపించారని తాబిందా స్నేహితులు ఆ షోలో చెప్పినప్పుడు, ఆమె చాలా కూల్‌గా ఉంటారు.
"సతీశ్ అమ్మాయిలతో గడపడాన్ని ఇష్టపడతాడు. కొన్నిసార్లు అసూయగా అనిపిస్తుంది, కానీ ఆయనపై నమ్మకం ఉంది. ప్రతి పార్టీకి వేర్వేరు అమ్మాయిలతో వెళితే నాకు అభ్యంతరం లేదు. ఒకే అమ్మాయితో పదే పదే బయటకు వెళ్తుంటేనే సమస్య. ఎందుకంటే ఒకే వ్యక్తిని మళ్లీ మళ్లీ కలిస్తే.. ప్రేమ పుడుతుంది" అని ఆమె అంటారు.
ఇలాంటి మాటల వల్లే తాబిందా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
సైకాలజిస్ట్ నిషా ఖన్నా రియాలిటీ షో కంటిస్టెంట్స్‌తో పనిచేశారు. మ్యారేజ్ కౌన్సెలింగ్ కూడా చేస్తారు.
"దీన్నిబట్టి చూస్తే తాబిందాకు ఆత్మవిశ్వాసం లేదని తెలుస్తోంది. ఆమె పితృస్వామ్య భావజాలాన్ని అంగీకరించారు. ఒకవేళ తాబిందా ఇలాంటి పార్టీలకు వెళ్లి అబ్బాయిలను కలిస్తే, ఆమె భర్త అందుకు అంగీకరిస్తారా అని షోలో ఆయనను ప్రశ్నించారా?" అని ఆమె అన్నారు.
"భర్త మోసం చేసినా, ప్రతిసారీ వేరే మహిళ అయితే భార్యకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నేను ఒక రియాలిటీ షోలో చూశాను" అని సినీ దర్శకురాలు లక్ష్మీ అయ్యర్ సోషల్ మీడియాలో రాశారు.
"ఇలాంటి అసంబద్ధమైన విషయాలను జనరలైజ్ చేయకండి. విధేయత, నిజాయితీ ఇప్పటికీ ఆకర్షణీయమైన గుణాలే. కానీ ప్రమాణాలు ఎంతగా దిగజారిపోయాయంటే, ఓటీటీలో వీటిని ఆమోదయోగ్యంగా చూపిస్తున్నారు" అని ఆమె అన్నారు.
'దేశీ బ్లింగ్' షోను విమర్శించేవారున్నారు, అలాగే దాన్ని ఇష్టపడేవారు కూడా ఉన్నారు.
"ఈ షో నాకు బాగా నచ్చింది. ఇందులో చాలా డ్రామా ఉంది... అందరూ ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకుంటున్నారు. తర్వాతి సీజన్ త్వరగా రావాలి" అని దుబాయ్‌కు చెందిన అనిల్ బ్రిజ్‌లాల్, ఫేస్‌బుక్‌లో రాశారు.
ఈ షో ఒక ఘోరమైన ప్రమాదంలాంటిదని, దాన్ని చివరి వరకు చూడాల్సిందే అనిపిస్తుందని ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాగర్ మరియా మోట్స్ కూడా ఫేస్‌బుక్‌లో రాశారు.
షో చూసిన తర్వాత నిషా ఖన్నా ఏమన్నారంటే, "దేశీ బ్లింగ్ అనేది పితృస్వామ్యం, కుటుంబ రాజకీయాలు, కేవలం డబ్బు, వ్యక్తిగత లాభం కోసం ఏర్పడిన సంబంధాలను చూపించే షో"
"కానీ ఈ షో వినోదాత్మకంగా ఉంటుంది. అంతటి ధనవంతులు ఎలా జీవిస్తారో, ఏం వేసుకుంటారో, వారి పార్టీలు ఎలా ఉంటాయో ప్రజలు చూడాలనుకుంటారు. అందుకే దీనికి ఆదరణ" అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, NETFLIX
'గోల్డ్ క్వీన్' లేదా 'గోల్డ్ డిగ్గర్'
'దేశీ బ్లింగ్'లో మహిళా పాత్రల గురించే కాదు, పురుష పాత్రలపైనా చర్చ జరుగుతోంది.
ఉదాహరణకు, తేజస్వి సరైన జీవిత భాగస్వామికాదని కరణ్ కుంద్రాకు తాబిందా సలహా ఇస్తుంది. అయితే, ఆమె లేనప్పుడు..."జీవితంలో ఏదైనా సాధించినవారి సలహాలు మాత్రమే వింటాను. తాబిందా వదిన సతీశ్ భార్యగా మాత్రమే అందరికీ తెలుసు" అని కరణ్ అంటారు.
తాబిందా తన భర్తకు అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో అండగా నిలిచి, సొంత కంపెనీ కూడా నడుపుతూ, ఇంటిని, కూతురిని చూసుకుంటోందని కరణ్ మాటలను బట్టి మనకు అర్ధమవుతుంది. మరి అది నిజంగా గొప్ప విజయం కదా?
కానీ, కరణ్ దాన్ని ఒప్పుకోలేడు. అందుకే ఇతర పోటీదారులు తేజస్విని వ్యతిరేకించినా, చివరికి ఆమెకే అండగా నిలిచాడు కరణ్.
'ఫ్యాబులస్ వైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' అనే రియాలిటీ షో తర్వాత షాలినీ పాసి ఎలా ప్రసిద్ధి చెందారో, అలాగే బహుశా ఈ సిరీస్‌లో అత్యంత చర్చనీయాంశమైన పాత్రగా తాబిందా మారారు.
ఈ సీరియల్‌లో తాబిందా ఎక్కువగా ధనవంతుడైన పారిశ్రామికవేత్త భార్యగా, ఎలాంటి సంకోచం లేకుండా పార్టీలకు వెళ్తూ తన సంపదను ప్రదర్శించే వ్యక్తిగా కనిపిస్తుంది.
"మీరు నమ్మలేరు. నా దగ్గర 40 కిలోల బంగారం ఉంది. మా కూతురు పుట్టకముందే మా ఆయన తనకోసం బంగారు పాత్రలు చేయించారు. ఆమెకి బంగారు పళ్ళెం, బంగారు చెంచా, బంగారు గ్లాసు ఉన్నాయి" అని తేజస్వి ప్రకాశ్‌తో మొదటి సమావేశంలో తాబిందా చెప్పారు.
"దుబాయ్‌లోనే తను అత్యంత ధనవంతురాలైన పాప. ఆమె మొదటి పుట్టినరోజున 24 క్యారెట్ల బంగారు గౌను వేశారు. సతీశ్ ప్రతి ఏడాది నా కోసం మూడు కిలోల బంగారం కొంటాడు" అని ఆమె చెప్పారు.
ఆమె భర్త తాబిందాను 'గోల్డ్ క్వీన్' అని పిలుస్తారు. మరికొందరు ఆమెను 'గోల్డ్ డిగ్గర్' అని పిలుస్తారు.
ఎవరీ తాబిందా?
కానీ మీరు తాబిందా సోషల్ ప్రొఫైల్‌లోకి వెళ్తే మరోరకమైన తాబిందా కనిపిస్తుంది.
లింక్డ్‌ఇన్‌లో తాబిందా అనెక్స్ క్యాపిటల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్.
2025లో ఆమె కంపెనీకి ఫైనాన్షియల్ మార్కెట్‌లో "ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ" అవార్డు లభించింది.
బిజినెస్ లీడర్‌షిప్, మహిళా వ్యాపారవేత్తల గురించి ఆమె ప్రసంగాలు ఇస్తారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మామ్ ప్రెన్యూర్‌గా, విజనరీ లీడర్‌గా పరిచయం చేసుకుంటారు.
దేశీ బ్లింగ్‌లో డ్రామా, కలహాలు, గాసిప్, గ్లామర్, కుట్రలు అన్నీ ఉన్నాయి. దీని వైభవం ఇతర షోల కంటే 10 రెట్లు ఎక్కువ. కానీ ఈ షో కొన్ని అసౌకర్యకరమైన ప్రశ్నలను కూడా మిగుల్చుతుంది.
చాలాచోట్ల తాబిందా పితృస్వామ్య భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఆమె స్వయంగా దానికి బాధితురాలని నిషా ఖన్నా అంటున్నారు.
ఎనిమిదేళ్లపాటు తల్లి కాలేకపోయినప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి తాబిందా ఈ షోలో మాట్లాడారు.
"పిల్లలు పుట్టకపోతే చాలా కష్టంగా ఉంటుంది. భారతీయ కుటుంబాలలో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా?" అని ఆమె అన్నారు.
లండన్‌లో తన పిండాలను ఫ్రీజ్ చేయించుకుని, ఐవీఎఫ్ ద్వారా మళ్లీ తల్లి కావాలని తాబిందా కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Prodip Guha/Getty Images
భర్తను తిరిగి తన దారిలోకి తెచ్చుకోవడానికి మళ్ళీ తల్లి కావడమే తాబిందా చేసే చివరి ప్రయత్నమా?
"మా జీవితంలోకి మరో అబ్బాయి లేదా అమ్మాయి వస్తే, బహుశా సతీశ్ పార్టీలకు వెళ్లడం మానేస్తాడు, మా సమస్యలు కూడా పరిష్కారమవుతాయి" అని తాబిందా చాలాసార్లు చెప్పారు.
మొత్తంగా 'దేశీ బ్లింగ్' షో గురించి చెప్పాలంటే, అపారమైన డబ్బు, పెద్ద కార్లు, విలాసవంతమైన ఇళ్లు, గ్లామర్, దుబాయ్ పార్టీలతో కళ్లు చెదిరిపోవడం సహజం. లగ్జరీ బ్రాండ్లు ఇక్కడ ఎలా ఉంటాయంటే, మన ఇళ్లలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఉన్నట్టే ఉంటాయి.
బ్లింగ్ అంటే మెరిసే, ఖరీదైన, ఆడంబరమైన వస్తువులు అని అర్థం.
'దేశీ బ్లింగ్' అనేది కేవలం ఆడంబరాల ప్రదర్శన మాత్రమే కాదు, ఒంటరితనం, శూన్యత, అసంపూర్ణతను కూడా చూపించే షో. వీటిని లగ్జరీ వస్తువులు, ఆభరణాలు, రత్నాలతో కప్పిపుచ్చుతారు.
"నేను ఎక్కువగా హిందీలోనే మాట్లాడతాను. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, కానీ నా డబ్బే మాట్లాడుతుంది" అని సతీశ్ సన్‌పాల్ చెప్పిన మాటలు గుర్తుండిపోతాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























