'త్వరగా దర్శనం చేయిస్తానంటూ మంత్రి దగ్గర 1000 రూపాయల లంచం తీసుకున్న పూజారి', తర్వాత ఏమైందంటే..

ఫొటో సోర్స్, Handout
- రచయిత, ప్రభురావ్ ఆనందన్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని తనిఖీ చేసేందుకు ముఖానికి మాస్క్ వేసుకుని వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి వద్ద త్వరగా దర్శనం చేయిస్తానంటూ లంచం తీసుకున్న పూజారిని ఆలయంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించారు.
సదరు వ్యక్తి ఆలయంలో పూజారి కాదని, స్వచ్ఛంద సేవకుడిగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది.
అలాగే, ఈ ఘటనకు సంబంధించి ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇద్దరు కాంట్రాక్ట్ గార్డులను కూడా విధుల నుంచి తొలగించాలని దేవాదాయ శాఖ (తమిళనాడు హిందూ మత ధర్మాదాయ శాఖ) మంత్రి రమేశ్ ఆదేశించారు.
అంతేకాకుండా, తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల నుంచి చట్టవిరుద్ధంగా లంచాలు తీసుకున్న ఇద్దరు క్షురకుల లైసెన్సులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు.
మంత్రి రమేశ్ ముఖానికి మాస్క్ ధరించి తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మే 29న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో జరిగిన ఘటన గురించి దేవాదాయ శాఖ మంత్రి రమేశ్ శుక్రవారం బీబీసీతో మాట్లాడుతూ, "ఈరోజు ఉదయం నేను నా సహాయకుడితో కలిసి తిరుచెందూరు ఆలయంలో ఆకస్మిక తనిఖీలకు వెళ్లినప్పుడు, షణ్ముఖ మండపం వద్ద ఒక పూజారి మా దగ్గరికొచ్చి, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తే త్వరగా దర్శనం చేయిస్తానని చెప్పారు.
నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో, గూగుల్ పే చేయొచ్చని చెప్పి, జీపే చేయించుకుని ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లారు."
"ఆ తర్వాత విచారణ జరిపి పూజారి నుంచి వివరణ తీసుకున్నాం. లేఖలో ఆయన క్షమాపణలు కోరారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డబ్బులు తీసుకున్న పూజారి ఆలయంలో అడుగుపెట్టకుండా, పూజలు చేయకుండా నిషేధించాం" అని మంత్రి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
"తిరుచెందూర్ ఆలయంలో తనిఖీలకు సంబంధించి ముఖ్యమంత్రి విజయ్‌కు నివేదిక అందజేస్తాం. సీఎం నిర్ణయం మేరకు, ధర్మాదాయ శాఖ కమిషనర్, ఉన్నతాధికారులతో చర్చించి ఆలయ అధికారులపై కూడా చర్యలు చేపడతాం" అని మంత్రి అన్నారు.
ఈ ఘటనపై తిరుచెందూర్ ఆలయ తిరుసుగంధిరర్ సభ (స్థానిక బ్రాహ్మణ సంఘం) అధ్యక్షులు మూర్తి బీబీసీతో మాట్లాడుతూ, "పూజారిపై చర్యలను స్వాగతిస్తున్నాం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడాన్ని మేం తప్పకుండా సమర్థిస్తాం" అని అన్నారు.
తిరుసుగంధిరర్ సభకు చెందిన పూజారులు సంప్రదాయకంగా తిరుచెందూర్ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
"మాకు ఆలయం నుంచి ఎలాంటి వేతనాలు ఉండవు" అని మూర్తి చెప్పారు.
మంత్రి వద్ద డబ్బులు తీసుకున్న పూజారి కూడా ఇదే సంఘానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























