మీ ఉద్యోగం ఆనందాన్నిస్తోందా? ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఈ రోజుల్లో ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధి కోసం చేసే పని మాత్రమే కాదు.. అది వ్యక్తి గుర్తింపు, ఆత్మగౌరవం, సామాజిక స్థానం, కుటుంబ సంక్షేమానికి ఆధారంగా మారింది.
అయితే సాంకేతిక విప్లవం, పెరుగుతున్న పోటీ, అధిక పని భారం, కఠినమైన డెడ్లైన్లు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి కారణంగా ఉద్యోగుల జీవితాల్లో మానసిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం పని సంబంధిత ఒత్తిడి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది.
కోట్లమంది ఉద్యోగులు ప్రతిరోజూ పని స్థలాల్లో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కేవలం వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం కాకుండా కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం, కార్యాలయంలో పనితీరు, సంస్థల ఉత్పాదకతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
దీర్ఘకాలంలో ఇది వ్యక్తిగత స్థాయి నుంచి సంస్థాగత స్థాయికి, అక్కడి నుంచి దేశ ఆర్థికాభివృద్ధి వరకు ప్రతికూల ప్రభావాలను సృష్టించే సామాజిక-ఆరోగ్య సవాలుగా కూడా మారుతోంది.


ఫొటో సోర్స్, Getty Images
పని ఒత్తిడి అంటే ఏంటి?
ఉద్యోగానికి సంబంధించిన డిమాండ్లు, బాధ్యతలు, సమయపాలన, లక్ష్యాలు, వృత్తిపరమైన అంచనాలను తట్టుకోలేకపోయినప్పుడు ఏర్పడే మానసిక, భావోద్వేగ, శారీరక ప్రతిస్పందనను పని ఒత్తిడి (వర్క్ స్ట్రెస్) అంటారు.
ఒత్తిడి స్వల్పస్థాయిలో ఉంటే అది పనితీరును మెరుగుపరచగలదు. కానీ అది నిరంతరం కొనసాగితే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల నివేదికల ప్రకారం...
- ఆందోళన, డిప్రెషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 12 బిలియన్ పని గంటలు వృథా అవుతున్నాయి.
- దీని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది.
- గాలప్(Gallup) 2024 నివేదిక ప్రకారం ప్రపంచ ఉద్యోగుల్లో సుమారు 41% రోజువారీ పని ఒత్తిడిని అనుభవిస్తున్నట్టు తెలిపారు.
- భారత్‌లో అనేక సర్వేల ప్రకారం 70-80శాతం ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పని ఒత్తిడికి ప్రధాన కారణాలు
1. అధిక పనిభారం
సిబ్బంది తక్కువగా, బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగులు నిరంతర ఒత్తిడికి గురవుతారు.
2. డెడ్లైన్ల ఒత్తిడి
తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఆందోళనను పెంచుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఈ డెడ్లైన్ల ఒత్తిడి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది.
3. ఉద్యోగ భద్రతపై అనిశ్చితి
ఆర్థిక మాంద్యం, సంస్థాగత మార్పులు ఉద్యోగ భయాన్ని కలిగిస్తాయి. ప్రస్తుత కాలంలో జరుగుతున్న లే ఆఫ్‌లు దీనికి మంచి ఉదాహరణ. ఇది ఉద్యోగులపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.
4. పని-వ్యక్తిగత జీవితం మధ్య అసమతుల్యత
ఆఫీసు పనిని ఇంటికి తీసుకురావడం కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది.
5. ఆఫీస్ వివాదాలు
తోటి ఉద్యోగులు లేదా ఉన్నతాధికారులతో విభేదాలు ఒత్తిడిని పెంచుతాయి.
6. షిఫ్ట్ విధులు
రాత్రి షిఫ్టులు, అస్థిర పని గంటలు నిద్రను ప్రభావితం చేసి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు
మానసిక సమస్యలు
ఆందోళన, చిరాకు, నిరాశ, ఏకాగ్రత లోపం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది, ఆత్మవిశ్వాసం తగ్గడం,శారీరక సమస్యలు, తలనొప్పి, మెడ, భుజాల నొప్పులు, గుండె వేగం పెరగడం, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, అలసట, నిద్రలేమి, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, డయాబెటిస్.
ప్రవర్తనా మార్పులు
కోపం పెరగడం, పనిపై ఆసక్తి తగ్గడం, తరచూ సెలవులు తీసుకోవడం, మద్యం లేదా ధూమపానంపై ఆధారపడటం

ఫొటో సోర్స్, Getty Images
ఒత్తిడి ఎప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుతుంది?
కొన్ని లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే పరిస్థితి తీవ్రమవుతున్నట్టు భావించాలి. అవేంటంటే...
ప్రతిరోజూ తీవ్ర ఆందోళన, ఉద్యోగానికి వెళ్లాలనే ఆసక్తి లేకపోవడం, పనితీరు గణనీయంగా తగ్గిపోవడం, తీవ్రమైన నిద్రలేమి, డిప్రెషన్ లక్షణాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతినడం, తరచూ గుండె దడ, ఛాతి బిగుసుకుపోవడం, జీవితంపై నిరాశ వంటివన్నీ క్రమంగా "బర్నౌట్ సిండ్రోమ్" (Burnout Syndrome) గా మారే ప్రమాదం ఉంటుంది.
బర్నౌట్ సిండ్రోమ్ లక్షణాలు
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం బర్నౌట్ అనేది దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడికి ప్రతిస్పందనగా ఏర్పడే స్థితి. దీని ప్రధాన లక్షణాలు...
తీవ్రమైన శారీరక, మానసిక అలసట, పనిపట్ల విసుగు లేదా నిర్లక్ష్యం, పనితీరు తగ్గిపోవడం.
ఆరోగ్య సిబ్బంది, ఐటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసు సిబ్బందిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పని ఒత్తిడిని ఎలా అధిగమించాలి?
టైమ్ మేనేజ్మెంట్
ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం, పెద్ద పనులను చిన్న భాగాలుగా విభజించడం, ఒకేసారి అనేక పనులు చేయకుండా ఉండడం వంటివి ఇందులో భాగం.
శారీరక వ్యాయామం
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు...నడక, యోగా, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు చేస్తే అవి ఒత్తిడిని తగ్గిస్తాయి.
సరిపడా నిద్ర
ప్రతి రోజూ 7-8 గంటల నిద్ర అవసరం.
డిజిటల్ విరామం
ఆఫీసు టైమ్ తర్వాత వర్క్ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పరిమితం చేయాలి.
ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ సాధనలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
సామాజిక సంబంధాలు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కుటుంబ సభ్యుల పాత్ర
ఉద్యోగి మానసిక ఆరోగ్యంలో కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబ సభ్యులు సమస్యలను శ్రద్ధగా వినాలి. విమర్శించకుండా అర్థం చేసుకోవాలి. విశ్రాంతి తీసుకునే వాతావరణం కల్పించాలి.
అవసరమైతే వైద్య సలహా తీసుకునేందుకు ప్రోత్సహించాలి. కుటుంబ బాధ్యతలను పంచుకోవాలి.
కుటుంబ సభ్యుల మద్దతు ఉన్న ఉద్యోగులు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
యాజమాన్యం పాత్ర
పని ఒత్తిడి నివారణలో సంస్థల బాధ్యత కూడా ఎంతో ముఖ్యమైనది.
సంస్థలు సహేతుకమైన పనిభారం కేటాయించాలి. తగిన సిబ్బందిని నియమించాలి. పని గంటలను నియంత్రించాలి.
ఉద్యోగుల అభిప్రాయాలను వినాలి. మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంచాలి. సెలవుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో ఉద్యోగుల ఉత్పాదకత, ఉద్యోగ సంతృప్తి గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
1. కౌన్సెలింగ్
తేలికపాటి, మధ్యస్థ స్థాయి ఒత్తిడికి కౌన్సెలింగ్ చాలా ఉపయోగపడుతుంది.
2. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ)
ప్రతికూల ఆలోచనలను గుర్తించి వాటిని సానుకూల దిశగా మార్చే చికిత్సా విధానం.
3. మైండ్‌ఫుల్‌నెస్ థెరపీలు
ప్రస్తుత క్షణంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా ఆందోళనను తగ్గిస్తాయి.
4. మందులు
తీవ్రమైన ఆందోళన లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు మానసిక వైద్యులు అవసరమైతే మందులు సూచించవచ్చు.
5. ఉద్యోగ సంబంధిత జోక్యాలు
కొన్ని సందర్భాల్లో పనిభారం తగ్గించడం, విభాగం మార్పు, సెలవులు వంటి చర్యలు అవసరమవుతాయి.
పని ఒత్తిడి ఆధునిక ఉద్యోగ జీవితంలో పూర్తిగా తప్పించలేని అంశమే అయినప్పటికీ, దానిని ఎలా నిర్వహిస్తామన్నదే వ్యక్తి ఆరోగ్యం, విజయాన్ని నిర్ణయిస్తుంది. పరిమిత స్థాయిలో ఉన్న ఒత్తిడి పనితీరును మెరుగుపరచగలదు.
అయితే దీర్ఘకాలం కొనసాగితే అది మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
అందువల్ల పని ఒత్తిడిని వ్యక్తిగత సమస్యగా కాకుండా, సమష్టిగా పరిష్కరించాల్సిన అంశంగా చూడాలి. ఉద్యోగులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, కుటుంబ సభ్యులు భావోద్వేగ పరంగా అండగా నిలవడం, సంస్థలు ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు.
మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమనే అవగాహన సమాజంలో పెరగాలి. అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం పొందడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు.
ఆరోగ్యకరమైన మనస్సు, సమతుల్యమైన పని వాతావరణం, సహాయక కుటుంబ వ్యవస్థ కలిసి ఉంటేనే ఉద్యోగ జీవితంలో నిజమైన విజయం, సంతృప్తి సాధ్యమవుతాయి.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























