You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాలువలో 26 ఏళ్ల కిందట పడిపోయిన వ్యాన్ బయటపడింది.. అందులో మానవ అవశేషాలు, స్కూల్ యూనిఫాం
- రచయిత, నవజోత్ కౌర్, బిమల్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
"26 ఏళ్లు నా భర్త కోసం ఎదురుచూశాను. ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఎదురుచూడని రోజంటూ లేదు. కానీ, ఇప్పుడు ఆయన అస్థికలు కనిపించడంతో నా ఎదురుచూపులు ముగిసిపోయాయి."
పంజాబ్‌లోని రోపఢ్ జిల్లా ఆనంద్‌పూర్ సాహిబ్ సమీపంలోని కోట్ల గ్రామానికి చెందిన సీతాదేవి చెప్పిన మాటలివి. ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
అయితే, 26 ఏళ్ల తర్వాతైనా తన భర్తకు సంబంధించిన వార్త అందినందుకు ఆమెకు ఇప్పుడు ఓ సంతృప్తి ఉంది. అది ఆయన మరణవార్తే అయినప్పటికీ మనసుకు ప్రశాంతత దొరికింది.
26 ఏళ్ల కిందట సీతాదేవి భర్త మునిలాల్ ప్రమాదానికి గురయ్యారు.
2000 అక్టోబర్ 17న ఆయన ప్రయాణిస్తున్న వాహనం రోపఢ్ నుంచి ఆనంద్‌పూర్ వెళ్లే దారిలో, భాక్రా కాలువలో పడిపోయింది. ఒక పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మునిలాల్‌తో సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో డ్రైవర్ తేజ్ రామ్, సుర్జీత్ సింగ్, ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కాలూ కూడా ఉన్నారు.
దాదాపు రెండున్నర దశాబ్దాలు గడిచినా ఈ ప్రమాదానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మృతుల కుటుంబాలకు వారి చివరి గుర్తులు కూడా లభించలేదు.
అయితే, 2026 మే 17న రోపఢ్‌కు చెందిన స్థానిక గజ ఈతగాడు కమల్‌ప్రీత్ సైనీ, ఆయన బృందం భాక్రా కాలువలో పడిపోయిన ఆ మారుతి ఓమ్ని వ్యాన్‌ను కనుగొనడంలో విజయవంతమయ్యారు. ఆయన నాయకత్వంలో స్థానికుల సహాయంతో 26 ఏళ్ల తర్వాత కాలువ నుంచి పూర్తిగా పాడైపోయిన ఓమ్ని వ్యాన్‌ను, నలుగురి అస్థిపంజరాల భాగాలను బయటకు తీశారు.
ఈ కేసు 2000 అక్టోబర్ 17కు చెందినదని కీరత్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాహుల్ శర్మ తెలిపారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ప్రకారం 2000 అక్టోబర్ 19న డీడీఆర్ నమోదైంది.
దుకాణం అమ్మేసి భర్త కోసం వెతుకులాట..
వివాహమై 13 ఏళ్లు పూర్తయిన తర్వాత, 2000 అక్టోబర్ 17న తన భర్త మునిలాల్‌ను సీతాదేవి ఆఖరిసారిగా చూశారు.
కాలువలో లభ్యమైన ఓమ్ని వ్యాన్, అస్థికలు ఇప్పుడు ఆమెకు ఉపశమనాన్ని ఇచ్చాయి. 26 ఏళ్లుగా వెతుకుతున్న భర్తకు, ఇప్పటికైనా కనీసం అంతిమ సంస్కారాలు నిర్వహించగలుగుతున్నామనే తృప్తి దక్కింది.
2026 మే 18న, కాలువలో అస్థికలు లభించడంతో మునిలాల్ కుమారుడు దవీందర్ కుమార్ కీరత్‌పూర్ సాహిబ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మునిలాల్ భార్య సీతాదేవిని పరామర్శించడానికి, సంతాపాన్ని తెలియజేయడానికి వారి ఇంటికి బంధువులు, పొరుగువారు చేరుకుంటున్నారు.
సీతాదేవి మాట్లాడుతూ, "నా భర్త హల్వాయీ (మిఠాయిలు చేసేవారు). మాకు ఒక దుకాణం కూడా ఉండేది. 2000 అక్టోబర్ 17న మధ్యాహ్నం నన్నడిగి దుస్తులు తీసుకెళ్లారు. సాయంత్రం దుకాణంలోనే రెడీ అయ్యి కీరత్‌పూర్ సాహిబ్‌లో జరిగే ఒక పెళ్లికి బయలుదేరారు."
" అయితే, వారు పెళ్లి మండపానికి చేరుకోలేదు. మేం ఎదురుచూస్తూనే ఉన్నాం, కానీ ఆయన రాలేదు. మా పక్కనే ఉన్న నక్కియా గ్రామం వద్దనున్న భాక్రా కాలువలో వారి వాహనం పడిపోయింది. అక్టోబర్ 17న వ్యాన్ పడిపోయింది. 18న మామూలుగా వెతికాం, 19న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. వ్యాన్ కాలువలో పడినట్లు 20న మాకు తెలిసింది. కానీ, ఎలాంటి ఆధారం దొరకలేదు" అన్నారు.
"చాలా దూరం నుంచి గజ ఈతగాళ్లు (డైవర్లు) వచ్చారు, కాల్వలో వ్యాన్ కోసం వెతికారు, కానీ ఏమీ లభించలేదు. దాదాపు నెల రోజుల పాటు ఈతగాళ్లు కాలువలోకి దిగి వెతికారు. వారిని కనుగొనడం కోసం మా మూడు కుటుంబాలు మా దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేశాం, అయినా ఎక్కడా ఏ ఆనవాళ్లు దొరకలేదు" అన్నారు సీతాదేవి.
మునిలాల్ కుమారుడు దవీందర్ కూడా తన తండ్రి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
"ఈ ప్రమాదం జరిగినప్పుడు నాకు ఏడేళ్లు ఉంటాయి. నాకు చాలా విషయాలు గుర్తు లేవు కానీ, మా నాన్న ఒక రోజు అకస్మాత్తుగా మాయమయ్యారని మాత్రం తెలుసు" అన్నారాయన.
తండ్రి మునిలాల్ ఏదో ఒకరోజు తిరిగి వస్తారని ఎదురుచూసినట్లు దవీందర్ తెలిపారు.
వ్యాన్‌ను ఎలా బయటకు తీశారు? అందులో ఏమున్నాయి?
మృతుడు మునిలాల్ కుమారుడు దవీందర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... "ఇలాంటి ఒక వ్యాన్ కాల్వలో పడిపోయి ఉందనే విషయాన్ని మేం, చుట్టుపక్కల ప్రజలు చాలాకాలం కిందటే ఈతగాడు (డైవర్) కమల్‌ప్రీత్ సైనీకి చెప్పాం.
దాదాపు ఆరు నెలల కిందట, మునిగిపోయిన మరో వ్యక్తి కోసం కమల్‌ప్రీత్ కాల్వలో దిగినప్పుడు ఈ వ్యాన్‌ను గుర్తించారు. బయటకు వచ్చిన తర్వాత కాల్వ లోపల అలాంటి ఒక వ్యాన్ ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒకసారి కెమెరాతో కాల్వ లోపలికి వెళ్లి పూర్తి వీడియో తీశారు. దాన్ని చూసిన తర్వాతే అది మా వ్యానేనని నమ్మకం కుదిరింది" అన్నారు.
నీటిలో నుంచి వ్యాన్‌ను బయటకు తీసే పనిని కమల్‌ప్రీత్ సింగ్ సైనీ, స్థానికులు కలిసి పూర్తి చేశారు.
వ్యాన్‌ను బయటకు తీస్తున్న సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి హ్యాపీ సైనీ బీబీసీతో మాట్లాడుతూ, మే 17న వ్యాన్‌ను బయటకు తీయాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అందుకోసం ఈతగాడు కమల్‌ప్రీత్ సైనీ బృందంతో పాటు వందలాది మంది ప్రజలు కాల్వ వద్దకు తరలివచ్చారు.
"ఉదయం 9 గంటల ప్రాంతంలో కమల్‌ప్రీత్ సైనీ కాల్వ లోపలికి వెళ్లి వ్యాన్‌కు తాడు కట్టారు. కాల్వ ఒడ్డున ఉన్న ప్రజలు ఆ తాడు సహాయంతో వ్యాన్‌ను పైకి లాగడం ప్రారంభించారు, కానీ ఫలితం లేకపోయింది" అని హ్యాపీ సైనీ అన్నారు.
"ఆ తర్వాత జేసీబీని రప్పించారు. జేసీబీ సహాయంతో వ్యాన్‌ను బయటకు తీశారు. వ్యాన్ పూర్తిగా విరిగిపోయి ఉంది. అయినప్పటికీ అది ఓమ్ని వ్యాన్ అని స్పష్టంగా తెలిసింది. వ్యాన్‌ను తనిఖీ చేసినప్పుడు కొన్ని అస్థిపంజరాల భాగాలు, దుస్తుల ముక్కలు లభించాయి. వాటిలో స్కూల్ యూనిఫాం కూడా ఉంది. వ్యాన్ లోపల ఒక బెంచ్ కూడా దొరకడంతో ఇది ఆ వ్యానేనని ధ్రువీకరణైంది. దాదాపు మూడు నాలుగు గంటల శ్రమించి వ్యాన్‌ను పైకి తీసుకురాగలిగారు" అన్నారు.
పోలీసులు ఏమన్నారు?
దీనికి సంబంధించి 2000 సంవత్సరంలో సుర్జీత్ సింగ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా ఒక డీడీఆర్ నమోదైందని కీరత్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాహుల్ శర్మ బీబీసీకి చెప్పారు.
"వ్యాన్ కాల్వలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లు ఆ డీడీఆర్‌లో పేర్కొన్నారు. అప్పట్లో వెతకడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ వ్యాన్ దొరకలేదు. మే 17న ఈ వ్యాన్ లభ్యమవడంతో, దానిని యజమానుల కుటుంబానికి అప్పగించాం. వాహనంలో ఒక ఆర్సీ కూడా దొరికింది. కానీ, దానిపై ఉన్న నంబర్లు, అక్షరాలు పూర్తిగా చెరిగిపోయాయి" అని చెప్పారు.
"ఈ ప్రమాదం జరిగిన సమయంలో అప్పటి ఈతగాళ్ల వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. కానీ, కమల్‌ప్రీత్ వద్ద ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్లే ఇప్పుడు ఆయన ఈ వ్యాన్‌ను కనుగొనగలిగారు" అన్నారు ఎస్‌హెచ్‌ఓ రాహుల్ శర్మ.
ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?
పోలీస్ అధికారి రాహుల్ శర్మ చెప్పిన దాని ప్రకారం, భాక్రా కాలువ, సట్లెజ్ నది పక్కపక్కనే ప్రవహిస్తుండటం వల్ల కీరత్‌పూర్ ప్రాంతంలో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం, వాహనాలు పడిపోవడం, ఎవరైనా నీటిలో మునిగిపోవడం వంటి సంఘటనలు సాధారణంగా జరుగుతుంటాయి.
వీటిలో ఆత్మహత్యల గణాంకాలే ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు నదిలో, కాల్వలో పడిపోయేందుకు అనేక కారణాలు ఉండవచ్చు. ఒక్కో కేసుకు ఒక్కో కారణం ఉంటుంది. ప్రధాన రహదారి పక్కనే నది ప్రవహిస్తూ ఉండటం వల్ల మితిమీరిన వేగం, డ్రైవింగ్‌లో అజాగ్రత్త లేదా ప్రకృతిసిద్ధమైన కారణాల వల్ల కూడా వాహనాలు నీటిలో పడిపోయే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
సట్లెజ్ నదిలో లేదా కాలువల్లో స్నానం చేయడం పూర్తిగా నిషేధించినప్పటికీ, పిల్లలు, పెద్దలు తమ ఇష్టానుసారంగా స్నానాల కోసం నదిలోకి వెళ్తుంటారు.
ప్రజల భద్రతకు పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ శర్మ పేర్కొన్నారు.
అయితే, "ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనడానికి ఎలాంటి గణాంకాలు లేదా ఆధారాలు లేవు" అని ఆనంద్‌పూర్ సాహిబ్ ఎస్‌డీఎమ్ సుఖ్‌పాల్ సింగ్ బీబీసీతో చెప్పారు.
"నదులు, కాలువలు ఉన్న ప్రాంతం కావడం వల్ల ప్రమాదాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంతేకాని, రోపఢ్‌లోని ఈ ప్రాంతంలో నీటిలో మునిగిపోయే కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. ఒడ్డున రైలింగ్ ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి పాలనా యంత్రాంగం పూర్తిగా కృషి చేస్తోంది" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)