ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'

    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్ట్, రీసర్చర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

పంజాబ్‌లోని పటియాలాలో, 1928 జనవరి 28న జరిగిన కుస్తీ పోటీ ఎంతటి ప్రజాదరణ పొందిందంటే.. భారతీయ సంస్థానాధీశులు, బ్రిటిష్ అధికారులతో పాటు వేలాది మంది ప్రజలు అక్కడికి తరలివచ్చారు.

గామాగా పేరొందిన బ్రిటిష్ - ఇండియన్ రెజ్లర్ గులాం హుసేన్ అలియాస్ గామా, పోలండ్‌ రెజ్లర్ స్టానిస్లావ్ సిగానియోవిచ్‌కు మధ్య ఈ పోటీ జరిగింది.

గామా అసలు పేరు గులాం మొహమ్మద్ అని కొందరు వాదిస్తారు.

అయితే ఆయన అసలు పేరు గులాం హుసేన్ అని పలు పుస్తకాలు నిర్థరిస్తున్నాయి.

సయ్యద్ ఆగా అషర్ లఖ్నవి రాసిన 'గామా గమక్', ఫహీముద్దీన్ ఫహ్మీ రచించిన 'రుస్తమ్ ఎ జమాన్ గామా' జీవిత చరిత్ర, అఖ్తర్ హుసేన్ షేక్ రాసిన 'దాస్తాన్ ఏ తారీఖ్ ఏ పహల్వానీ' అనే పుస్తకాలన్నీ గామా అసలు పేరు గులాం హుసేన్ అనే నిర్ధరిస్తున్నాయి.

ఈ పుస్తకాల్లోని సమాచారమంతా అధికారిక పత్రాలు, రెవెన్యూ రికార్డుల నుంచే కాక, గామా స్వయంగా చెప్పిన విషయాలు, ఆయన బంధువులు, అభిమానుల నుంచి సేకరించిన సమాచారం, ధ్రువీకరించిన కథనాల నుంచి తీసుకున్నదే.

గామాగా ప్రసిద్ధిచెందిన గులాం హుసేన్ 1878 మే 22న, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉన్న 'దతియా' రాజ్యంలో, అజీజ్(పూర్తి పేరు అబ్దుల్ అజీజ్ లేదా అజీజ్ బక్ష్) దంపతులకు జన్మించారు.

అజీజ్ తండ్రి కశ్మీర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చారు. గామా పుట్టే సమయానికి, అజీజ్ దతియా రాజ్యంలో మల్లయోధుడిగా కొనసాగుతున్నారు.

గామాకు ఆరేళ్లు కూడా నిండకుండానే ఆయన తండ్రి మరణించారు.

అప్పటికే ఆయన గామాకు కుస్తీని పరిచయం చేశారని అఖ్తర్‌షేక్ రాశారు.

తండ్రి మరణించిన రెండు నెలలకు గామాకు ఇమామ్ బక్షి అనే తమ్ముడు పుట్టాడు.

గామా మల్లయోధుడైన తన తాత (తల్లి తండ్రి) నూన్ వద్ద పెరగడంతో అతన్ని ‘గామా నూన్‌వాలాగా’ పిలిచేశారు.

నూన్ పహిల్వాన్ హత్యకు గురైన తర్వాత, ఆయన కుమారుడు.. అంటే మేనమామ ఇదా పహిల్వాన్ గామాను పెంచే బాధ్యత తీసుకున్నారు.

గామాను ఆయన తండ్రి కోరుకున్నట్లే అగ్రశ్రేణి మల్లయోధుడిగా తీర్చిదిద్దుతానని ఇదా పహిల్వాన్ మాట ఇచ్చినట్లు 'క్రికెట్ కంట్రీ: యాన్ ఇండియన్ ఒడిస్సీ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఎంపైర్'‌ అనే పుస్తకంలో ప్రశాంత్ కిడాంబి పేర్కొన్నారు.

తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం, గామా అత్యంత కఠిన వ్యాయామ నియమావళిని అనుసరించారు.

10వ ఏటనే అత్యధిక సిటప్స్ చేసిన ఘనత

జోసెఫ్ ఆల్టర్ రాసిన "గాంధీస్ బాడీ"లోని "గామా ది గ్రేట్" అనే చాప్టర్‌లో, కేవలం పదేళ్ల వయసులోనే గామా 400 మంది రెజ్లర్ల మధ్య అత్యధిక సిటప్స్ చేసి రికార్డు సృష్టించారని రాశారు.

ఈ పోటీలో 400 మందికి పైగా రెజ్లర్లు పాల్గొంటే, చివరి 15 మందిలో గామా ఒకడిగా నిలిచారని రోనోజోయ్ సేన్ రాశారు.

గామా చిన్నపిల్లాడు కావడంతో జోధ్‌పూర్ మహారాజు జస్వంత్ సింగ్ అతన్ని విజేతగా ప్రకటించి, తన సంరక్షణలోకి తీసుకున్నారు.

"నేను ఎన్ని ప్లాంక్స్ చేశానో నాకే తెలియదు. అయితే, నా కండరాలన్నీ పట్టుకుపోయి, వారం రోజులపాటు మంచం మీద నుంచి లేవలేకపోయాను’’ అని ఆ తరువాత గామా చెప్పారని షేక్, ఫహ్మీల కథనం చెబుతోంది.

జోధ్‌పూర్‌లో ఉన్నప్పుడు రాజా జస్వంత్ సింగ్ సలహా మేరకు, వారి రెండో మేనమామ బూటా పహిల్వాన్ గామాను అతని తమ్ముడు ఇమామ్‌ బక్ష్‌ను ఉస్తాద్ మాధో సింగ్ వద్ద శిక్షణలో చేర్చించారని లఖ్నవి రాశారు.

అక్కడ నాలుగేళ్ల పాటు శిక్షణ పొందారు. జోధ్‌పూర్ రాజు మరణానంతరం గామా దతియాకు వచ్చేశారు.

15 గంటల వ్యాయామం

దతియా శివార్లలోని ఒక పెద్ద తోటలోని ప్రభుత్వ భవనంలో గామా ఒక అఖారాను నిర్మించుకున్నారని లఖ్నవి రాశారు.

"కాళ్లు, తుంటి కండరాల బలోపేతం కోసం గామా ప్రతిరోజూ రెండు వేల పుష్-అప్స్ చేసేవారు. ఆయన ఐదు వేల సిట్-అప్స్ (స్క్వాట్స్), ముగ్దార్‌తో (కుస్తీ వ్యాయామాలకు ఉపయోగించే, ఒక వైపు బరువుగా ఉండే కర్ర) రెండు వేల హ్యాండ్-స్వింగ్స్ కూడా చేసేవారు."

"నేను చూసినంతవరకూ గామా సుమారు ఐదు మణుగుల బరువున్న ఒక రాతి పలకను మెడలో వేసుకుని తోట చుట్టూ, కనీసం ఒక మైలు దూరం పరిగెత్తేవారు. ఆయన అరుదుగా నూనెతో మర్దన చేయించుకునేవారు." అని లఖ్నవి రాశారు.

'పహల్వాన్‌ కీ దునియా' పుస్తక రచయిత, భారత రెజ్లర్ బర్కత్ అలీ రాసినమేరకు గామా ప్రతిరోజూ ఉదయం 2 గంటల నుంచి 10 గంటల వరకు శరీరంలోని దిగువ భాగానికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు శరీరంలోని పై భాగానికి వ్యాయామం చేసేవారు.

"ప్రతిరోజు సాయంత్రం ఆయన 2 గంటలపాటు నడిచేవారు. కాబట్టి, గామా 24 గంటల్లో 15 గంటలు వ్యాయామం చేసేవాడని మనం చెప్పవచ్చు."

ఆహారంగా 20 లీటర్ల పాలు, ఆరు కోళ్లు, ఇంకా ఎన్నో..

తీవ్రమైన శారీరక శ్రమను తట్టుకునేలా తన శరీర ధృడత్వం కోసం ఆయన భారీ పరిమాణంలో యాఖ్నీ(మాంసం, ఎముకలతో చేసిన సూప్) తాగేవారు. అలాగే రోజుకు 20 లీటర్ల పాలు, అరలీటరు నెయ్యి, పావు కిలో వెన్న, 4 కిలోల పండ్లు తీసుకునేవారని ప్రశాంతి కిడాంబి రాశారు .

చిన్నతనంలో గామా రోజూ 500 దంతర్లు (కర్రలతో చేసే వ్యాయామం), అంతే సంఖ్యలో సిట్ అప్స్ చేసేవారు. పదిహేనేళ్ల వయసు వచ్చేప్పటికి రోజుకు 3000 సిట్ అప్స్, అదే సంఖ్యలో దంతర్లు చేసే స్థాయికి వచ్చారు. 20 ఏళ్ల నాటికి 5000 దంతర్లు, 3000 నుంచి 4000 సిట్ అప్స్‌కు పెరిగింది. పాతికేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఆయన సాధారణంగా రోజుకు 6000 సిట్ అప్స్, 5000 దంతర్లు చేసేవారని అఖ్తర్ హుస్సేన్ షేక్ రాశారు.

"తన రోజువారీ ఆహారంలో ఆరు కోళ్లు లేదా మటన్‌తో చేసిన ఐదు సేర్ల (సుమారుగా 4.5 కిలోలు) యఖ్నీతో పాటు 10 సేర్ల పాలు, అరసేరు నెయ్యి, ఒకటింపావు సేరు బాదం పప్పులు, పలు రకాల జామ్‌లు ఉండేవి."

గామా భోపాల్ సమీపంలోని రీవా సంస్థానాధీశుడు రాజా ప్రతాప్ సింగ్ సంరక్షణలోనూ ఉన్నారు. అక్కడ 'మీరన్ సింగ్ భక్కీ వాలా' వద్ద నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు.

శతాబ్దపు ప్రారంభ సంవత్సరాల్లో దతియా ఆస్థానంలో మల్లయోధులు కొలువు చేసేవారని కిడాంబి రాశారు. ఇతర సంస్థానాలకు చెందిన ఎంతోమంది మల్లయోధులను పలుమార్లు ఓడించడం ద్వారా వారు ఖ్యాతి గడించారు.

"ఆ కాలంలోనే భయంకరమైన మల్లయోధుడు గులాం మొహియుద్దీన్‌పై సాధించిన విజయమే గామా అతిపెద్ద విజయం."

"ఆ సమయంలో రహీమ్ సుల్తానీవాలా మాత్రమే గామాకు దీటుగా నిలబడగలిగారు. 1907, 1909 మధ్య ఈ ఇద్దరు మల్లయోధులు మూడుసార్లు తలపడ్డారు. కానీ, ఎవరికీ స్పష్టమైన విజయం దక్కలేదు. అయినప్పటికీ, చాలామంది విమర్శకులు దశాబ్దం చివరినాటికి గామాను భారతదేశంలోనే గొప్ప మల్లయోధుగడిగా పరిగణించారు."

లఖ్నవి ప్రకారం, గామా తన ప్రధాన 16 కుస్తీ పోటీల గురించి చెబుతూ, తన 12వ ఏట మొదటి పోటీ గెలిచినట్లు చెప్పారు.

గులాం మొహియుద్దీన్‌తో జరిగిన ఈ రెజ్లింగ్ పోటీని నిపుణులు 'అర నిమిషం' మ్యాచ్‌గా అభివర్ణించారని షేక్ రాశారు. ఈ విజయానికి గానూ దతియా రాజు గామాకు 20 వేల రూపాయలు, 22 సేర్ల బరువున్న వెండి గదను బహుమతిగా ఇచ్చారు.

'రహీమ్ సుల్తానీ మాత్రమే పోటీపడగలడు'

రహీమ్ సుల్తానీవాలాతో తన మొదటి డ్రాను "ఒకరకంగా విజయం"గా అభివర్ణించారు గామా. ఎందుకంటే, ఆయన ప్రకారం "ఆ సమయంలో భారతదేశంలో ఆయనకు సరిసమానమైన మల్లయోధుడు మరొకరు లేరు."

తర్వాత ఇందోర్, లాహోర్‌లలో కూడా ఆయనతో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. అయితే, అలహాబాద్‌లో "దేవుడు నాకు విజయాన్నందించాడు, రుస్తమ్ ఎ హింద్ గద దక్కింది." అన్నారు గామా.

ప్రపంచ స్థాయి పోటీల్లోనూ ఓటమెరుగని గామా

గామా ప్రపంచ స్థాయిలో కూడా ఓటమెరుగని విజేతగా నిలిచి, పేరు సంపాదించారు.

1910లో, జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గామాను లండన్ పంపించారు. గామా, ఆయన సోదరుడు, మరో ఇద్దరు రెజ్లర్ల కోసం బెంగాల్‌కు చెందిన ధనవంతుడైన శరత్ కుమార్ మిత్ర అన్ని ఏర్పాట్లు చేశారు. దురదృష్టవశాత్తూ, గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అధికారికంగా పోటీదారుగా అంగీకరించలేదని ఆల్టర్ రాశారు.

"అయితే, ఒక స్థానిక థియేటర్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌‌‌ల కోసం వారానికి 250 పౌండ్ల చొప్పున వేతనం ఇచ్చింది. ఈ అనధికారిక వేదిక నుంచి, లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు గామా. ఐదు నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు."

"తక్కువ సమయంలోనే గామా పోటీదారులందరినీ ఓడించారు. తద్వారా అధికారిక టోర్నమెంట్‌లో స్థానం సంపాదించారు, అక్కడ ప్రపంచ చాంపియన్, పోలండ్ రెజ్లర్ స్టానిస్లావ్ సిగానియోవిచ్‌‌ను ఎదుర్కొన్నారు."

కిడాంబి ప్రకారం, ఆ ఇద్దరి మధ్య మ్యాచ్ మొదలైన వెంటనే పోలండ్ రెజ్లర్ నేలపై పడుకోవడంతో, కుస్తీ పట్టేందుకు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.

"గామా ఎంతగా ప్రయత్నించినా, స్టేడియంలోని 8 వేల మంది ప్రేక్షకులు కేకలు వేస్తున్నా, ఆయన అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించారు. రెండున్నర గంటలకు పైగా సాగిన తర్వాత, ఫలితం తేలని ఈ మ్యాచ్‌ను చివరకు రద్దు చేశారు. ఆగ్రహంతో కొందరు ప్రేక్షకులు నిరసన తెలిపేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చారు, దీంతో ఫలితాన్ని తేల్చే ప్రయత్నంలో భాగంగా మరుసటి వారం మళ్లీ మ్యాచ్‌ ఏర్పాటు చేశారు."

"గామా సమయానికే స్టేడియానికి చేరుకున్నప్పటికీ సిగానియోవిచ్‌‌ జాడ కనిపించలేదు. దీంతో గామాను విజేతగా ప్రకటించి, ఆయనకు 250 పౌండ్ల బహుమతిని అందజేశారు. ఎంపీ హోరాషియో బాటమ్‌లే ఆయనకు 'జాన్ బుల్ గోల్డెన్ బెల్ట్'ను బహూకరించారు. దీనినే రుస్తమ్ ఎ జమానా సర్టిఫికెట్‌గా పరిగణించేవారు."

గామా, ఆయన సహచరులు 1912లో పటియాలా రాజు భూపిందర్ సింగ్ వద్ద పనిచేయడం ప్రారంభించారు. ఆయన జీతం నెలకు 500 రూపాయలుగా నిర్ణయించగా, ఇతర రెజ్లర్ల జీతాలు 30 నుంచి 100 రూపాయల వరకూ ఉండేవి.

18 ఏళ్ల తర్వాత సవాల్ విసిరిన సిగానియోవిచ్‌‌

ఓటమి చెందిన 18 ఏళ్ల తర్వాత, సిగానియోవిచ్‌‌ సవాల్ మేరకు పటియాలాలో మళ్లీ కుస్తీ పోటీ జరిగింది.

ఈ మ్యాచ్‌ కోసం ఏర్పాటు చేసిన స్టేడియంలో 'లక్ష మందికి పైగా ప్రజలు' నినాదాలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ పత్రిక రాసింది.

జోసెఫ్ ఆల్టర్ తన పుస్తకంలోని గామా ది గ్రేట్ చాప్టర్‌లో, ఈ పోటీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సిగానియోవిచ్‌‌ ఆలస్యంగా రావడంతో 4 గంటల 15 నిమిషాలకు మొదలైనట్లు రాశారు.

"పోటీ ప్రారంభం కాగానే, గామా 300 పౌండ్ల బరువున్న ఆ పోలిష్ రెజ్లర్‌ ఒక కాలిని గట్టిగా పట్టుకుని, మరో కాలిని నేలపై నుంచి పైకి లాగేశారు. క్షణాల్లోనూ సిగానియోవిచ్‌‌ నేలకూలారు."

రోనోజోయ్ సేన్ తన "నేషన్ ఎట్ ప్లే: ఏ హిస్టరీ ఆఫ్ స్పోర్ట్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో ఇలా రాశారు. "గామా సింహంలా దూకి, కేవలం 30 సెకన్లలో సిగానియోవిచ్‌‌‌ను కుప్పకూల్చారు"

"చుట్టూ ఉన్న జనం నుంచి నినాదాలు మార్మోగాయి. గామా అరనిమిషం పాటు సిగానియోవిచ్‌‌ పైనే ఉన్నారు, అనంతరం రెఫరీ ఆయన్ను విజేతగా, ప్రపంచ చాంపియన్‌గా ప్రకటించారు."

ఆల్టర్ ప్రకారం, "పటియాలా మహారాజు గామాను హత్తుకుని, తన మెడలోని విలువైన ముత్యాలహారాన్ని తీసి ఆయన మెడలో వేశారు."

అనంతరం, మహారాజు ఏనుగుపై గామాను ఊరేగించారు. ఆయనకు ఒక వెండి గద, 6 వేల రూపాయల వార్షిక భృతి, ఒక గ్రామం బహుమతిగా లభించాయి

గామాను వార్తాపత్రికలు ప్రశంసలతో ముంచెత్తాయి. "గామా, నువ్వు నిజంగా ఒక సింహానివి" అన్న సిగానియోవిచ్‌‌ మాటలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.

గామాకు రుస్తమ్ ఎ జమాన్ బిరుదును ఖరారు చేసిన ఈ మ్యాచ్ ఊహించిన దానికంటే త్వరగానే ముగిసింది.

1910 నాటి లండన్ మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్‌ కూడా రెండు గంటల కంటే ఎక్కువసేపు కొనసాగితే వెలుతురు అవసరమవుతుందని భావించి నిర్వాహకులు ఎలక్ట్రిక్ బల్బులు, సెర్చ్‌లైట్లను కూడా ఏర్పాటు చేశారని సేన్ రాశారు.

పీటర్‌సన్ ఓటమి

పటియాలా మ్యాచ్ తర్వాత, ప్రపంచంలోని చాంపియన్లకే చాంపియన్‌గా తనను తాను చెప్పుకునే జెస్ పీటర్సన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్‌కు ఒక లేఖ రాస్తూ, అందులో గామాకు సవాల్ విసిరారు.

పారిస్‌లో ఉండే పీటర్సన్.. తాను సిగానియోవిచ్‌‌‌ను మూడుసార్లు ఓడించానని, ఒక పోటీ ఏర్పాటు చేయాలని రాజును కోరారు.

1929 ప్రారంభంలో, పటియాలాలో పదివేల మంది ప్రేక్షకులు, పటియాలాతో పాటు చుట్టుపక్కల ఉన్న రాజకుటుంబాల సమక్షంలో ఈ పోటీ జరిగింది. ఈ పోటీలోనూ గామా సునాయాసంగా గెలిచారు.

దేశ విదేశాల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న గామా, ఎప్పుడూ అజేయంగానే నిలిచారు.

బర్కత్ అలీ ప్రకారం, 55 నుంచి 65 సంవత్సరాల మధ్య, గామా తన వ్యాయామాలను కొన్ని తగ్గించుకున్నారు.

లఖ్నవీ ప్రకారం, ఈ కాలపు గొప్ప మల్ల యోధుడు గామా అని 1940లో మాంచెస్టర్ గార్డియన్‌లో జాక్ వుడ్ రాశారు. అప్పటికి ఆయన వయసు 60 సంవత్సరాలు.

"ఆయన 3 వేల రెజ్లింగ్ మ్యాచ్‌లలో పోరాడారు, కానీ ఎప్పుడూ ఓడిపోలేదు."

గామా కొంతకాలం లాహోర్‌లో, మరికొంతకాలం పటియాలాలో నివసించారు. 1947లో ఉపఖండం విభజన సమయంలో గామా పటియాలా నుంచి లాహోర్‌కు మకాం మార్చారు.

నవాజ్ షరీఫ్‌ కుటుంబంతో సంబంధమేంటి?

తన మొదటి భార్య మరణం తర్వాత, గామా రెండవ భార్య అయిన వజీర్ బేగం ఐదుగురు కుమారులను ప్రసవించింది, కానీ వారిలో ఎవరూ బతకలేదు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు.

గామా కుమార్తెలలో ఒకరైన రజియా బేగం, డాక్టర్ మొహమ్మద్ హఫీజ్‌ను వివాహం చేసుకున్నారు. వారి కుమార్తె కుల్సూమ్, అంటే గామా మనవరాలు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను వివాహం చేసుకున్నారు.

1960, మే 22న గామా రావి నదికి అవతలి వైపున్న తోటకు వెళ్లాల్సి వచ్చిందని అఖ్తర్ రాశారు. ఆ సమయంలో గామాతో పాటు ఆయన కుమార్తె గీతి ఆరా కూడా ఉన్నారు. తన మరణానంతరం తల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని, తనముందు కంటనీరు పెట్టనని ఆమె నుంచి మాట తీసుకున్నారు. గామా తన చేతులు పైకెత్తి ఆమెను ఆశీర్వదించారు.

ఇంతలో, వజీర్ బేగం కూడా అక్కడికి చేరుకున్నారు. అది సుదీర్ఘ ప్రయాణం కాబట్టి తాను స్నానం చేయాలని గామా చెప్పారు. గామా స్నానం చేసి, కుటుంబ సభ్యుల సాయంతో దుస్తులు మార్చుకున్నారు. గీతి ఆరా ఆయన జుట్టు దువ్వింది. ఆ తర్వాత ఆయన మందులు వేసుకోవడం మానేశారు. రెండు లడ్డూలను ఎంతో ఇష్టంగా, రుచిని ఆస్వాదిస్తూ తిన్నారు.

1960 మే 23న ఫజ్ర్ (ఉదయం ప్రార్థన) పిలుపు రాకముందే నిద్రలేచి, ఒక గుక్క నీరు తాగారు. ఆ తర్వాత ఆయన తన కుమార్తెతో, "ఇక నువ్వు నిద్రపో. నేను ఇక ఎవరినీ ఇబ్బంది పెట్టను" అన్నారు.

ఇవే 'రుస్తం జమాన్' చివరి మాటలు. ఆయన మూడుసార్లు బలంగా శ్వాస తీసుకున్నారు. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)