'అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడం వల్ల శిశువు గర్భంలోనే చనిపోయింది', కుటుంబ సభ్యుల ఆరోపణ.. అసలేం జరిగింది?

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ప్రసవం సమయంలో తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని హింగోలిలో వెలుగులోకొచ్చింది.

"డీజిల్ లేక అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఒకవేళ అంబులెన్స్ సమయానికి అందుబాటులో ఉండుంటే బిడ్డ ప్రాణాలు దక్కేవి. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది" అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆరోగ్య శాఖ పనితీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హింగోలి జిల్లాలోని ఔంధా నాగనాథ్ తాలూకాలో ఉన్న జవళా బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అంబులెన్స్ ఉన్నప్పటికీ గర్భిణులకు అది అందుబాటులో లేదని బంధువులు ఆరోపించారు.

అయితే, అంబులెన్స్‌లో డీజిల్ ఉందని, కానీ డ్రైవర్ అందుబాటులో లేరని ఆరోగ్యశాఖ చెబుతోంది.

అసలేం జరిగింది?

హింగోలి జిల్లాలోని జవళా బజార్‌ ఆరోగ్య కేంద్రంపై 25కి పైగా గ్రామాల ప్రజలు ఆధారపడుతున్నారు.

నలేగావ్‌కు చెందిన మనీషా ఓంప్రకాష్ ఇంగ్లేకు ప్రసవ నొప్పులు మొదలవడంతో మే 26న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు.

అయితే, ప్రసవం కష్టంగా మారిందని గ్రహించిన వైద్యులు ఆమెను చికిత్స కోసం హింగోలి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు సూచించారు.

అంబులెన్స్ కోసం 102,108 హెల్ప్‌లైన్‌లను వాళ్లు సంప్రదించారు.

అయితే, ఫోన్ చేసిన గంట తర్వాత కూడా అంబులెన్స్ రాలేదు. మళ్లీ సంప్రదించినప్పుడు డీజిల్ లేదని, అంబులెన్స్ పంపించలేమని చెప్పినట్టు బంధువులు తెలిపారు.

గంటన్నరసేపు వేచి చూసినా అంబులెన్స్ రాలేదు. గర్భిణికి నొప్పులు ఎక్కువవడంతో బంధువులు చివరకు ఒక ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించి హింగోలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆలస్యమైందని, ప్రసవ సమయంలోనే మనీషా ఇంగ్లే బిడ్డ చనిపోయిందని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు.

'అలా అయితే బిడ్డ బతికేది'

"మేం అంబులెన్స్‌కు ఫోన్ చేశాక చాలాసేపు ఎదురుచూశాం. అయినా అంబులెన్స్ రాలేదు. ఆ సమయంలో అంబులెన్స్ హెల్త్ సెంటర్ దగ్గర పార్క్ చేసి ఉంది. దానిలో డీజిల్ లేదని చెప్పారు.

అప్పుడు మేం మరో కారు పిలిపించి ఆస్పత్రికి వెళ్లాం. వైద్యులు ఆమెను పరీక్షించి సిజేరియన్ చేశారు. కానీ కడుపులోనే బిడ్డ చనిపోయిందని చెప్పారు" అని మనీషా ఇంగ్లే తల్లి అనితా శంకరరావు రాఖుండే తెలిపారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఎంపీ రామ్‌రావ్ వడ్కుతే డిమాండ్ చేశారు.

నిజంగా డీజిల్ లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకాశ్ అబిత్కర్ హెచ్చరించారు.

''ఈ బిడ్డను వ్యవస్థే చంపేసింది'' అని రాజకీయ నాయకురాలు రోహిణి ఖడ్సే అన్నారు. ఆరోగ్య శాఖపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

విచారణకు ఆదేశాలు

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసినట్టు జిల్లా ఆరోగ్య శాఖాధికారి కైలాష్ షెల్కే తెలిపారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, "అంబులెన్స్‌లో డీజిల్ ఉంది. డ్రైవర్ ఏదో కారణంతో సెలవులో ఉన్నారు" అని చెప్పారు.

''ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో వైద్యాధికారులు విఫలమయ్యారని ప్రాథమికంగా తెలిసింది. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)