You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువకాలం జీవిస్తారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- రచయిత, ఎల్లెన్ సాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఎక్కువకాలం జీవిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు జీవించే కాలం దాదాపు ఐదేళ్లు ఎక్కువ. ఇది అంతర్జాతీయ సగటు.
మహిళలు ఇలా ఎక్కువకాలం జీవించడానికి కారణాలేంటో కచ్చితంగా తెలియదు. అయితే శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు తెలియజేశారు.
పక్షులు వంటి కొన్ని జాతుల్లో ఆడవాటితో పోలిస్తే మగవి ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నాయో తెలుసుకోవడానికి కూడా ఈ విషయాలు ఉపయోగపడతాయి.
''ప్రతి దేశంలో మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు'' అంటారు యూకేలోని ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్‌లో వృద్ధాప్య పరిశోధన సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ సారాహ్ హార్పర్. ''అయితే ఒక దేశానికీ, మరో దేశానికీ మధ్య ఈ విషయంలో చాలా తేడాలుంటాయని'' ఆమె అన్నారు.
రష్యా, యుక్రెయిన్, వియత్నాంలో పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపు పదేళ్ల కాలం ఎక్కవ జీవిస్తారు. నైజీరియా వంటి ప్రాంతాల్లో మగవారితో పోలిస్తే మహిళలు జీవించే కాలం ఇంత ఎక్కువ ఉండదు అవర్ వరల్డ్ ఇన్ డేటా ప్రచురణ తెలిపింది.
ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడా
మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి సామాజిక, వ్యక్తిగత ప్రవర్తన లాంటి తేడాలు దీనికి కొంత కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రష్యాలో దీనికి ప్రధాన కారణం పొగతాగడం, ఆల్కహాల్ అని హార్పర్ అంటున్నారు. రష్యాలో పురుషుల్లో ఈ అలవాట్లు సాధారణంగా ఉంటుంటాయి.
''జీవితకాలాన్ని తగ్గించే సామాజిక ప్రవర్తన ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో కనిపిస్తుంటుంది. వారి ఆహారపు అలవాట్లు కూడా అనారోగ్యంగా ఉంటాయి'' అని హార్పర్ తెలిపారు.
వైద్యుల దగ్గరికి కూడా పురుషులు పెద్దగా వెళ్లరని, పెళ్లయిన వాళ్ల విషయంలో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుందని, జీవిత భాగస్వామి వారిని వైద్యుల దగ్గరకు తీసుకెళ్తారని హార్పర్ వివరించారు.
చాలా సమాజాల్లో మగవాళ్లు ప్రమాదకరమైన ఉద్యోగాలు చేస్తుంటారని, పురుషత్వం అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడం అనే భావన నెలకొని ఉంటుందని ఆమె తెలిపారు.
కారు ప్రమాదాలు, హింస, హత్య,ఆత్మహత్యల వల్ల పురుషుల మరణాలు ఎక్కువ ఉంటాయన్నారు.
అయితే ఇదే పరిస్థితి స్థిరంగా ఉండదు.
ఉదాహరణకు 1960లు, 70ల్లో పొగ తాగడానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారాలతో పురుషుల అకాల మరణాలు యూకేలో తగ్గాయి. మహిళలు, పురుషుల మరణాల్లో వయసు వ్యవధి అకస్మాత్తుగా ఆగిపోయిందని హార్పర్ తెలిపారు.
అలవాట్లు మార్చుకోవడం వల్ల ఈ తేడా మొత్తం తొలగిపోదు. ఎందుకంటే పురుషులు, మహిళల మధ్య జీవ వైవిధ్యం ఎప్పటికీ ఉంటుంది.
ఈస్ట్రోజెన్ వర్సెస్ టెస్టోస్టిరాన్
ఈ జీవ వైవిధ్యాల్లో హార్మోన్లు ఒకటి. ''ఈస్ట్రోజెన్స్ వల్ల మహిళలకు అనేక రకాలుగా ఉపయోగాలుంటాయి''అని ప్రొఫెసర్ కాన్‌సుయెలో బొర్రాస్ చెప్పారు. బొర్రాస్ స్పెయిన్‌లోని వాలెన్సియా యూనివర్శిటీలో ఏజింగ్ సైకాలజిస్ట్.
కొవ్వు స్థాయి, రోగనిరోధకవ్యవస్థ నియంత్రించడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించడం, మెదడు, ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడం వంటివాటిలో ఈస్ట్రోజెన్ పాత్ర ఉటుందని ఆమె తెలిపారు.
అది యాంటీఆక్సిడెంట్‌లా పనిచేయడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. మన కణాల్లో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ అనే హానికారకాలను అది ఎదుర్కొంటుంది. ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్యానికి కారణమవుతాయి.
''మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ రక్షణ కోల్పోవడం శరీరానికి సంబంధించిన అనేక చర్యలపై ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు వృద్ధాప్య ప్రక్రియ వల్ల ఆస్టియోపోరోసిస్(ఎముకలు గుల్లబారడం) వస్తుంది. ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం కూడా దీనికి మరో కారణం'' అని బొర్రాస్ వివరించారు.
మెనోపాజ్ ప్రారంభ దశలో మహిళలకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తే జీవక్రియల్లో కొన్ని మళ్లీ మెరుగుపడుతున్నాయని ఆమె చెప్పారు.
టెస్టోస్టిరాన్ ప్రభావముంటుందా?
మరోవైపు పురుషుల్లో ప్రధాన లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్‌పై ప్రవర్తన, అలవాట్ల ప్రభావం ఉంటుంది. ఇది శరీరంలో కూడా హానికారిక ప్రభావాలను కలిగిస్తుందని బొర్రాస్ అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
టెస్టోస్టిరాన్ విడుదల కాని చారిత్రక కొరియన్ నపుంసకుల బృందానికి చెందిన వారు సాధారణ పురుషులతో పోలిస్తే 14 నుంచి 19సంవత్సరాలు ఎక్కువగా జీవించారని 2012లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.
అయితే ఈ సమాచారానికి కొన్ని పరిమితులున్నాయి. కానీ దాన్ని మళ్లీ అదే విధంగా పరీక్షించడం సాధ్యం కాదు. అయితే వ్యంధత్వం ఉన్న మగ జంతువులు కూడా ఎక్కువ కాలం జీవిస్తాయని ఆధారాలున్నాయి.
దీర్ఘాయువు రహస్యంలో హార్మోన్ల పాత్ర ఉండొచ్చు. వీటితో పాటు ఇంకా అనేక కారణాలున్నాయి.
''ఇందులో చాలా విషయాలున్నాయి. వాటిలో కొన్ని మనకు తెలుసు. కానీ ఇది చాలా సంక్షిష్టమైన విషయం'' అని ఆమె తెలిపారు.
పరిణామక్రమం ఇచ్చే సంకేతాలేమిటి?
ఈ విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి కొందరు శాస్త్రవేత్తలు ఇతర జీవులపైనా అధ్యయనం చేస్తున్నారు. దీర్ఘకాలం జీవించే స్త్రీజాతి కేవలం మానవులకే పరిమితం కాలేదు.
సింహాలు, గొర్రెలు, ఓర్కా తిమింగలాలు, ఎలుకలు వంటి అనేక పాలిచ్చే జీవులలోనూ ఇది కనిపిస్తోంది. అయితే పక్షులలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మగ పక్షులే సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తాయి. భిన్నమైన సెక్స్ క్రోమోజోమ్స్ ఉండటమే దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు.
"స్తన్యజీవులలో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ మగవాటికి ఒక ఎక్స్, ఒక వై మాత్రమే ఉంటాయి" అని జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ పరిశోధకురాలు జోహన్నా స్టీర్క్ చెప్పారు.
రెండు ఎక్స్‌క్రోమోజోమ్స్ ఉండటం ఆడజాతికి ఓ రక్షణలా పనిచేస్తుంది. ఎందుకంటే అవి జిరాక్స్ కాపీలా పనిచేస్తాయి. "ఒక క్రోమోజోమ్‌లో లోపం వచ్చినా, మరో కాపీ దాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది" అని స్టార్క్ వివరించారు.
మగవారికి ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉండటం వల్ల, అలాంటి లోపాలు ఎక్కువ ప్రభావం చూపవచ్చు" అని తెలిపారు.
ఒకే జీవిత భాగస్వామితో ఆయుష్షు పెరుగుతుందా?
పక్షుల్లో పరిస్థితి తారుమారుగా ఉంటుంది. మగ పక్షులకుఒకే రకమైన రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిని జడ్ క్రోమోజోమ్స్ అంటారు. ఆడ పక్షులకు ఒక జడ్, ఒక డబ్ల్యు క్రోమోజోమ్ ఉంటుంది.
"ఈ కారణంగానే క్షీరదాలలో ఆడవి ఎక్కువ కాలం జీవిస్తే, పక్షుల్లో మగవి ఎక్కువ కాలం జీవించే పరిస్థితి ఉండవచ్చు" అని స్టార్క్ తెలిపారు.
అయితే, ఆమె 2025లో ప్రచురించిన పరిశోధన కథ అంతటితో ముగియలేదు.
"ఏక భాగస్వామితో జీవించే జాతుల్లో ఆడ,మగల మధ్య పెద్ద తేడాలు కనిపించవు," అని ఆమె చెప్పారు. "కానీ ఒక భాగస్వామి కోసం ఎక్కువ పోటీ నెలకొనే జాతుల్లో అంటే గోరిల్లాలు, సింహాలు వంటివాటిల్లో ఈ తేడాలు చాలా ఎక్కువగా ఉంటాయి'' అని తెలిపారు.
అలాంటి జాతుల్లో మగజీవి, సహచరిని ఆకర్షించడానికి పెద్ద శరీరం లేదా భారీ కొమ్ములు పెంచుకోవడంలాంటి ఎక్కువ శక్తి అవసరమయ్యే లక్షణాలపై దృష్టి పెట్టి, దాని వల్ల దీర్ఘాయుష్షును కోల్పోయి ఉండవచ్చని ఆమె భావిస్తున్నారు.
ఇక ఆడజీవుల్లో పరిణామ క్రమం వేరే దారిలో సాగి ఉండవచ్చు.
"ప్రత్యేకంగా మనుషులు లేదా గ్రేట్ ఏప్స్ వంటి ఎక్కువ కాలం జీవించే జాతుల్లో, పిల్లలను పెద్దయ్యే వరకు పెంచడానికి తల్లి ఎక్కువ కాలం బతకడం ప్రయోజనకరంగా ఉంటుంది" అని స్టార్క్ చెప్పారు.
ఎక్కువ కాలం... కానీ ఆరోగ్యంగా కాదా?
కానీ ఎక్కువ కాలం జీవించడమనే విషయం మహిళలకు అంత మంచి వార్తేం కాదు.
మహిళలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవించినా, ప్రాణాపాయం లేని అనేక ఆరోగ్య సమస్యలను జీవితాంతం ఎక్కువగా ఎదుర్కొంటారని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు నడుము నొప్పి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు.
"మహిళల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా స్పందిస్తుంది. కానీ అదే కొన్ని ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులకు దారితీస్తుంది" అని సారా హార్పర్ వివరించారు. "అదే సమయంలో మహిళల కండరాలు, ఎముకల వ్యవస్థ పురుషులతో పోలిస్తే కొద్దిగా బలహీనంగా ఉంటుంది"
"పురుషుల శరీర నిర్మాణం వారిని మరణానికి ఎక్కువగా గురిచేస్తే, మహిళల శరీర నిర్మాణం వారిని రోగాల విషయం నిస్సహాయులను చేస్తుంది" అని ఆమె చెప్పారు.
జీవశాస్త్ర సంబంధిత తేడాలే మన భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించవని మాత్రం ఈ ముగ్గురు నిపుణులు స్పష్టంగా చెప్పారు.
"జీవశాస్త్ర తేడాలపై పరిసరాలు, జీవనశైలి, అలవాట్లు అన్నీ ప్రభావం చూపుతాయి" అని మారియా బొరాస్ తెలిపారు.
మహిళలు గానీ పురుషులు గానీ కేవలం ఎక్కువ కాలం బతకడానికే కాదు, మంచి ఆరోగ్యంతో జీవించడానికి కూడా ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలంటారు మారియా బొరాస్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.