You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో కమ్యూనిస్టుల పతనానికి కారణమేంటి?
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్‌లో 1957తర్వాత తొలిసారి కమ్యూనిస్టులు అధికారానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేరు.
కేరళలో సీపీఐ (ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) ఎన్నికల్లో ఓటమి పాలై, దశాబ్దం తర్వాత అధికారం కోల్పోయింది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం కొనసాగిన ప్రజాస్వామ్య కమ్యూనిజం ప్రయోగాల్లో ఒకటి ప్రస్తుతానికి ముగిసినట్టయింది.
బాగా బలంగా ఉన్న సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.
ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, విద్యార్థి విభాగాలు, క్రమశిక్షణగల క్యాడర్ నెట్‌వర్క్స్‌తో పదికోట్ల ప్రజల జీవితాలను ఆ పార్టీలు ప్రభావితం చేశాయి.
వామపక్ష కూటమి 1977 నుంచి 2011వరకు పశ్చిమ బెంగాల్‌ను పాలించింది. త్రిపురలో వామపక్షాలు ఏకబిగిన పాతికేళ్లపాటు అధికారంలో ఉండటంతోపాటు మొత్తంగా 35ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. 2018లో త్రిపురలో బీజేపీ గెలిచింది.
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన స్థాయి నుంచీ...
కేరళలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో 1957లో తొలిసారి కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ప్రపంచ చరిత్రలోనే ఎన్నికల్లో గెలిచి కమ్యూనిస్టులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఇది.
అప్పటినుంచి లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య అధికారం మారుతూ వచ్చింది. కమ్యూనిస్టులు బలమైన శక్తిగా నిలిచారు. అయితే శాశ్వత ఆధిపత్యం ఎప్పుడూ లభించలేదు.
1996లో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం)వ్యవస్థాపక సభ్యులు జ్యోతిబసు సంకీర్ణ ప్రభుత్వ నేతగా భారత ప్రధాని పదవికి కొద్ది దూరంలో నిలిచారు. కానీ పార్టీ ఈ అవకాశాన్ని తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని తర్వాతి కాలంలో జ్యోతి బసు ''చారిత్రక తప్పిదం''గా అభివర్ణించారు.
సంకీర్ణ రాజకీయాలపై దిల్లీలో కమ్యూనిస్టులు ప్రభావం చూపారు. అమెరికాతో భారత్ చారిత్రక అణుఒప్పందంపై విభేదిస్తూ అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి 2008లో కమ్యూనిస్టులు మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఆ సమయంలో లోక్‌సభలో లెఫ్ట్ పార్టీలకు 62సీట్ల బలముంది. లెఫ్ట్ పార్టీల మద్దతు ఉపసంహరణతో అమెరికాతో ఒప్పందానికి ముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సివచ్చింది.
కమ్యూనిస్టుల ప్రభావం పార్లమెంట్‌కే పరిమితం కాలేదు.
పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టుల హయాంలో ఆర్థిక స్తబ్దత, విద్యాప్రమాణాలు పడిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమయినప్పటికీ తాము బలంగా ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థికపరమైన ఆలోచనలు, మేథోప్రపంచం, సాంస్కృతిక జీవనంపై వామపక్షాలు అసాధారణ ప్రభావాన్ని కొనసాగించాయి.
ఆ వెలుగు ఇప్పుడు మసకబారిపోయిందని చాలా మంది భావిస్తున్నారు.
సంస్కరణల ప్రభావమెంత?
లెఫ్ట్ పార్టీల పరిస్థితి ప్రస్తుతం భారత్ అంతటా ఒకేతీరులో లేదు. కేరళలో తాజాగా అధికారం కోల్పోయినప్పటికీ వామపక్షాలు రాజకీయంగా ప్రాధాన్యతాశక్తిగానే ఉన్నాయి.
తమిళనాడులో కూటమి రాజకీయాల ద్వారా ప్రధానంగా ఉనికి చాటుకుంటున్నాయి. బిహార్‌లో సీపీఐ(మార్క్సిస్ట్-లెనినిస్ట్) కొన్ని ప్రాంతాల్లో గ్రామీణస్థాయిలో బలంగా కనిపిస్తోంది.
ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో కమ్యూనిస్టుల మద్దతు ఉన్న విద్యార్థి సంఘాల ప్రభావం బాగా ఉంది.
కానీ ఒకప్పుడు వామపక్షాల అధికారానికి పెట్టని కోటలుగా ఉన్న పశ్చిమబెంగాల్, త్రిపురలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుపార్టీలు తమ ప్రాభవాన్నంతటినీ కోల్పోయాయి.
దేశవ్యాప్తంగా పరిస్థితి గమనిస్తే సీపీఐ(ఎం)ఓట్ల శాతం 1980ల్లో 6శాతం కన్నా ఎక్కువ ఉండగా, ఇటీవలి సాధారణ ఎన్నికల్లో అది 2శాతం దిగువకు పడిపోయింది. ఈ తగ్గుదల పాతతరం రాజకీయ భాష కనుమరుగవుతోందని చెప్పడానికి సంకేతంగా నిలుస్తోంది. వర్గపోరాటం, సామూహిక ఉద్యమాల స్థానంలో గుర్తింపు రాజకీయాలు, జాతీయవాదం, ప్రజాకర్షక నాయకత్వం, సంక్షేమపథకాలు వచ్చిచేరాయి.
దీని వెనక పెద్ద చారిత్రక మార్పు ఉందని సీపీఐ(ఎం)పశ్చిమ బెంగాల్ కార్యదర్శి మొహమ్మద్ సలీమ్ అభిప్రాయపడుతున్నారు. 1990లనుంచి హిందూ జాతీయవాదం పెరగడం, మార్కెట్ ఉదారవాద విధానాలతో మతపరమైన, రాజకీయ, ఆర్థికదాడి వామపక్షాలను అన్నివైపుల నుంచీ బలహీనపరిచిందని ఆయన వాదిస్తున్నారు.
''మధ్యతరగతికి ఆకర్షణీయమైన భవిష్యత్ చూపించారు. అభివృద్ధి, ఆధునికీకరణ, మౌలికవసతుల్లో మీకూ భాగం దక్కుతుందన్న ఆశలు కల్పించారు. దీంతో మధ్యతరగతి ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి'' అని ఆయన విశ్లేషించారు.
‘సామాజిక ప్రజాస్వామ్యవాదులు’
వర్గ పోరాటాలకు ప్రాధాన్యత తగ్గి, కులమతాల ఆధారంగా వ్యవస్థీకృత రాజకీయాలు పెరిగాయని, వాటికి తగ్గట్టుగా కమ్యూనిస్టులు ప్రతిస్పందించలేకపోయారని సలీమ్ విశ్లేషించారు. విభజన రాజకీయాలు వర్గ ఐక్యతను దెబ్బతీశాయని ఆయన అన్నారు.
హిందూ జాతీయవాదం, కుల రాజకీయాలు, సంక్షేమ రాజకీయాలు పెరగడం మాత్రమే లెఫ్ట్ పార్టీల పతననానికి కారణం కాదని నిపుణులు వాదిస్తుంటారు.
చైనా, వియత్నాంలోలా కమ్యూనిస్టులు భారత్‌లో మొత్తం దేశాన్నీ పరిపాలించలేదని, సమాఖ్య రాజకీయ వ్యవస్థలో కొన్ని రాష్ట్రాలను మాత్రమే పాలించాయని సంజయ్ రుపర్లియా చెప్పారు. టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్శిటీలో ఆయన రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్.
రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండడం వల్ల పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి వంటివాటి ఒత్తిడిలో లెఫ్ట్ ప్రభుత్వాలు పడిపోయాయి. పశ్చిమబెంగాల్‌లో ఈ వైరుధ్యం ప్రభావం తీవ్రస్థాయిలో కనిపించింది. భూసంస్కరణల ద్వారా ఎదిగిన పార్టీనే పరిశ్రమల పేరుతో రైతుల భూములను తీసుకుంటోందన్న ఆరోపణలు ఎదుర్కొంది.
వికేంద్రీకరణ, అత్యుతన్నత సామాజికసూచీలు, అక్షరాస్యత, పేదరికం తగ్గింపు, బలమైన ప్రజారోగ్యవ్యవస్థతో కేరళ దీనికి భిన్నంగా నిలిచి అంతర్జాతీయ గుర్తింపు సాధించింది.
అయితే ఈ నమూనాలో అంతర్గత ఒత్తిళ్లున్నాయి.
''కేరళ విదేశాల నుంచి వచ్చే నగదుపై భారీగా ఆధారపడుతోంది. అవి స్థిరంగా కొనసాగకపోవడంతో ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఉపాధి కల్పనలో ఈ లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా యువతకు సరిపడా ఉద్యోగాలు లభించడం లేదు'' అని రుపర్లియా చెప్పారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేరళ కమ్యూనిస్టులు ఒకప్పుడు తాము వ్యతిరేకించిన ఆర్థిక నమూనాలనే అనుసరించారు.
ప్రైవేట్ పెట్టుబడులు, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రైవేట్ యూనివర్శిటీలు, ప్రపంచంతో అనుసంధానమైన సాంకేతిక సేవలను 2022నాటి సీపీఐ(ఎం)విధాన పత్రం సమర్థించింది.
భారత కమ్యూనిస్టులను కమ్యూనిస్టులగా కంటే సామాజిక ప్రజాస్వామ్యవాదులుగా అర్ధం చేసుకోవడం సరైనదనే విస్తృత వాస్తవికతకు ఈ పరిణామం నిదర్శనంగా నిలిచిందని రుపర్లియా వంటి రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విప్లవాన్ని సాధించడం కన్నా ఈ పార్టీలు ఎక్కువగా సంక్షేమం, కార్మికుల హక్కులు, సంపద పున:పంపిణీపై దృష్టిపెట్టిన పార్లమెంటరీ పార్టీలుగా పనిచేశాయని అభిప్రాయపడ్డారు.
‘సిద్దాంతపరమైన గందరగోళం’
''కమ్యూనిస్టు సంప్రదాయాలు అనుసరించే పార్టీలు ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించడం భారత్‌లో ప్రత్యేకం'' అని రుపర్లియా అంటున్నారు.
అయితే సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మరోలా వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలెప్పుడూ అనేక పరిమితులకు లోబడి పనిచేశాయని ఆయన తెలిపారు.
''రాష్ట్రాలకు ఆర్థిక, పరిపాలన అధికారాలకు సంబంధించిన పరిమితులుంటాయి. అసలైన అధికారం దిల్లీలో ఉంటుంది'' అని ఆయన తెలిపారు.
''పెట్టుబడిదారీ సామాజిక ఆర్థిక వ్యవస్థలో కూడా పరిమిత అధికారాలతోనే ప్రజానుకూల విధానాలు, ప్రత్యామ్నాయాలు అమలుచేయవచ్చని చూపించడానికి మేం రాష్ట్ర ప్రభుత్వాలను ఉపయోగించాం. కానీ ఆ నమూనాను నిలబెట్టిన సామాజిక ఆధారం క్రమంగా బలహీన పడింది. భారత్‌లో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ పరిధి చాలా ఎక్కువ. ఇలాంటి చోట సంఘటిత కార్మికుల సంఖ్య ఎప్పుడూ హీనపక్షమే. సంక్షేమ రాజకీయాలు వర్గపోరాటం నుంచి క్రమంగా ప్రత్యక్ష నగదు బదిలీలకు, గుర్తింపు ఆధారిత కూటముల వైపుకు మారాయి'' అని ఆయన విశ్లేషించారు.
ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో వెల్లువెత్తిన ఆందోళనలు గ్రామీణ రాజకీయాలు ఎంతలా మారిపోయాయో తెలియజేశాయి.
''ఉద్యమంలో వామపక్షాల భాగం ఉన్నప్పటికీ అవి ఆందోళనలకు నేతృత్వం వహించే స్థాయిలో లేవు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర రైతు సంఘాలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి'' అంటారు విశ్లేషకులు శిఖా ముఖర్జీ
''హక్కులు, సంక్షేమానికి ప్రధాన గొంతుగా ఉండే స్థానాన్ని కమ్యూనిస్టులు కోల్పోయారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా మారడానికి లెఫ్ట్ పార్టీలు ఎదురీదుతున్నాయి. ప్రస్తుతం ఈ పార్టీల్లో సిద్ధాంతపరమైన గందరగోళం కనిపిస్తోంది''అని ముఖర్జీ చెప్పారు.
‘వీధుల్లో పోరాడాల్సినవాళ్లు ఎక్కడున్నారు?’
‘'భారత్‌లో ఇప్పుడు అసమానతలు, దీర్ఘకాల నిరుద్యోగం, తీవ్రమైన ఆర్థిక అభద్రత వంటి పరిస్థితులున్నాయి. ఒకప్పుడు ఇలాంటి వాటిని మార్క్సిస్టు రాజకీయాలకు అనుగుణమైనవిగా భావించేవారు. లెఫ్ట్ పార్టీలు చెప్పే మాటలను గమనిస్తే ఇలాంటి పరిస్థితితులు కచ్చితంగా వారికి లాభం కలిగించాలి'' అని రుపర్లియా అన్నారు.
మరి ఈ పరిస్థితులలో కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని ముఖర్జీ ప్రశ్నిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలు వీధుల్లోకొచ్చి పోరాటాలు చేయాలని, మరి ఆ పార్టీలెక్కడున్నాయని అడుగుతున్నారు.
ఈ వైరుధ్యం కనిపిస్తోంది భారత్‌లో మాత్రమే కాదు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత యూరప్‌లో కూడా కొత్త వామపక్షభావజాల పార్టీలు ఎదిగాయి.
వర్గ ఐక్యత కంటే వలసవాద రాజకీయాలు, జాతీయవాద విధానాల తర్వాత కార్మికులను ఆకర్షించగలిగిన జాతీయవాద నేతలతో పోరాడడంలో అవి ఇబ్బందులు ఎదుర్కొన్నాయని రుపర్లియా చెప్పారు.
భారత్‌లో వామపక్షాలు కూడా బీజేపీతో ఇలాంటి సవాలునే ఎదుర్కొన్నాయని ముఖర్జీ అంటున్నారు.
అయినప్పటికీ ఈ రాజకీయపార్టీల పనైపోయిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.
విభజనలు, ప్రభుత్వ అణిచివేత, ఎన్నికల పరాజయాలు వంటి వాటిని తట్టుకుని భారత కమ్యూనిజం నిలిచింది. సంస్థాగత నెట్‌వర్క్ బలహీనపడినప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో దీని ప్రభావం కొనసాగుతోంది. మిగిలిన ఆ కొద్ది ప్రభావాన్ని రాజకీయ పునరుజ్జీవ శక్తిగా లెఫ్ట్ పార్టీలు మార్చుకోగలవా అన్నది మరో ప్రశ్న.
''సీపీఐ(ఎం) తనను తాను మళ్లీ పునురుజ్జీవింపజేసుకోవాలి. ఆర్థిక ఉదారవాదం సృష్టించిన ఆర్థిక వ్యవస్థను వ్యతిరేకించడం కాకుండా దాని పరిధిలో పనిచేయడం నేర్చుకోవాలి'' అని ముఖర్జీ సూచించారు.
పశ్చిమ బెంగాల్‌లో పార్టీ తిరిగి సమీకృతమవుతోందని, గతంలోలా బలంగా మారేందుకు పనిచేస్తోందని, పునరుజ్జీవనం పొందుతోందని సలీమ్ చెబుతున్నారు.
మార్పును వ్యతిరేకించే వృద్ద పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు యువ నాయకులను ముందుకు తెస్తోంది.
''కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు తమను తాము పునరుజ్జీవింపజేసుకోవాలి. ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది మార్పు మాత్రమే'' అని బేబీ అన్నారు.
అయితే వామపక్షాలు ఈ స్థాయిలో పతనమవడం మాత్రం చాలా తీవ్రమైన విషయం. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో సీపీఐ(ఎం)ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. సాధించిన ఓట్ల శాతం కూడా 4 శాతం కన్నా కొంచెం ఎక్కువ మాత్రమే.
కేరళ కథ భిన్నమైనది. ఓడిపోయినప్పటికీ ఎల్డీఎఫ్ మూడోవంతు ఓట్లు సాధించింది. కమ్యూనిస్టులు ఇప్పటికీ అక్కడ బలమైన రాజకీయశక్తిగా ఉన్నారు. త్రిపురలో మాత్రం తిరిగి అధికారంలోకి రావడానికి దగ్గరగా ఉందన్న అభిప్రాయం కలగడం లేదు.
వామపక్షాల సామాజిక, రాజకీయ ప్రాధాన్యాన్ని ఎన్నికల్లో వాటి పతనాన్ని బట్టి చూడకూడదని పార్టీ నేతలంటున్నారు.
''మేమింకా ఆశతో ఉన్నామా అంటే కచ్చితంగా ఉన్నామనే చెబుతా'' అంటారు బేబీ.
''మేం లేకుండా భవిష్యత్తు ఎక్కడుందని మేమే ప్రశ్నిస్తున్నాం. సీట్లు ముఖ్యమేకానీ ప్రజల హృదయాల్లో మా స్థానం అన్నది మరింత ముఖ్యం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.