You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆత్మహత్యకు పాల్పడేవారిలో వివాహితులే ఎక్కువ, ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- రచయిత, మృదులిక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
వివాహాన్ని ఎంతో కాలంగా సామాజిక, కుటుంబ స్థిరత్వానికి చిహ్నంగా చూస్తూ వస్తున్నారు. కానీ, ప్రస్తుత గణాంకాలను గమనిస్తే ఈ స్థిరత్వాన్ని సాధించాలనే ఒత్తిడి ఇప్పుడు చాలామందిలో మానసిక ఆందోళనకు కారణమవుతోందని తెలుస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది దారితీస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది.
ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ 'యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2024' ప్రకారం.. దేశంలో ఆత్మహత్యలకు అతిపెద్ద కారణం ఇప్పటికీ కుటుంబ సమస్యలే.
2024లో నమోదైన 1.70 లక్షలకు పైగా ఆత్మహత్యల కేసుల్లో మూడో వంతుకు పైగా కేసులకు ఇదే కారణమని నమోదైంది. దీని తర్వాత దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అనారోగ్యం, మాదకద్రవ్యాలకు బానిసవ్వడం, వివాహానికి సంబంధించిన ఒత్తిడి వంటి కారణాలు ఉన్నాయి.
(ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడితో బాధపడుతుంటే భారత ప్రభుత్వ జీవన్‌సాథి హెల్ప్‌లైన్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. మీ స్నేహితులు, బంధువులతో కూడా మీరు మాట్లాడాలి).
ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో వివాహ సంబంధిత సమస్యలను ఒక ప్రత్యేక విభాగంలో చేర్చారు. ఇందులో పెళ్లి కుదరకపోవడం, వరకట్న వివాదాలు, వివాహేతర సంబంధాలు, విడాకులు, ఇతర వైవాహిక ఒత్తిళ్లు వంటి కారణాలు ఉన్నాయి.
ఆ రిపోర్టు ప్రకారం.. 18 నుంచి 30 సంవత్సరాల వయసుగల వారు దీని వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యారు, ఆ తర్వాతి స్థానంలో 30 నుంచి 45 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారు.
ఈ గణాంకాల్లో మరో విధానం కూడా కనిపిస్తోంది. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో వివాహితులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. నివేదిక ఆధారంగా, మొత్తం ఆత్మహత్య చేసుకున్న వారిలో 67.5 శాతం మంది వివాహితులు.
నాలుగో స్థానంలో తెలంగాణ
ప్రతి లక్ష జనాభాకు నమోదయ్యే ఆత్మహత్యల సంఖ్యను 'సూసైడ్ రేట్' (ఆత్మహత్యల రేటు) అంటారు. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సగటు ఆత్మహత్యల రేటు 12.2గా ఉంది.
ఈ కొలమానం ప్రకారం అండమాన్-నికోబార్ దీవులు(40.6) అగ్రస్థానంలో ఉన్నాయి. అంటే, అక్కడ ప్రతి లక్ష జనాభాకు దాదాపు 41 మంది ఆత్మహత్యల వల్ల మరణించినట్లు నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో సిక్కిం (36.3), కేరళ (30.2), తెలంగాణ (28.6), ఛత్తీస్‌గఢ్ (26.0) ఉన్నాయి. ఇక రాజధాని దిల్లీలో ఈ రేటు 13.2గా ఉంది.
సంఖ్యాపరంగా చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఇవి మొత్తం కేసులలో దాదాపు 49 శాతంగా ఉన్నాయి.
వివాహ సంబంధిత సమస్యలు (మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్) అంటే ఏమిటనే దానిపై దిల్లీలోని ఎన్‌సీఆర్‌బీ అధికారులతో బీబీసీ మాట్లాడింది.
అసిస్టెంట్ డైరెక్టర్ పూనమ్ తెలిపిన వివరాల ప్రకారం.. వివాహానికి సంబంధించిన ఒత్తిడి, పరస్పర అవగాహన లోపించడం లేదా బంధాలలో తలెత్తే ఇతర వివాదాలను ఈ విభాగంలో నమోదు చేస్తారు. అయితే, ఎన్‌సీఆర్‌బీ రాష్ట్రాల నుంచి వచ్చిన గణాంకాలను మాత్రమే సేకరిస్తుంది కాబట్టి పూర్తి సమాచారం తమ వద్ద ఉండదని అధికారులు చెబుతున్నారు.
దేశంలోని చాలా ప్రాంతాలలో వివాహాన్ని ఇప్పటికీ జీవితంలో 'సెటిల్' కావడంగానే చూస్తారని నిపుణులు చెబుతున్నారు. యువతపై చిన్న వయసు నుంచే పెళ్లికి సంబంధించిన అంచనాలను పెంచుతారు పెద్దవాళ్లు. నిర్ణీత సమయానికి పెళ్లి కాకపోతే చాలామంది తాము సామాజికంగా వెనుకబడిపోయామని లేదా ఇతరుల దృష్టిలో తక్కువైపోయామని భావిస్తుంటారు.
"నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బంధాలు, వివాహం పట్ల పెరుగుతున్న అనిశ్చితి. పెళ్లి తమ కెరీర్, కలలు, వ్యక్తిగత జీవితాన్ని ఎటువైపు తీసుకువెళుతుందో చాలామంది యువతకు అర్థం కావడం లేదు" అని దిల్లీకి చెందిన రిలేషన్‌షిప్ కౌన్సెలర్ రిచా హోరా అన్నారు.
ఇటీవలి కాలంలో ఎంతో కాలంగా కలిసి ఉంటున్న అవివాహిత జంటలు (కపుల్స్) పెళ్లి విషయంలో అయోమయంలో ఉండి ప్రీ-మ్యారేజ్ కౌన్సెలింగ్ కోసం వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆమె చెప్పారు.
దాదాపు ఎనిమిదేళ్లుగా బంధంలో ఉన్న ఒక జంట సహాయం కోసం వచ్చిన కేసును ఆమె ప్రస్తావించారు.
రిచా హోరా చెప్పినదాని ప్రకారం, ఆ ఇద్దరి గతం కూడా ఎన్నో ఇబ్బందులతో కూడి ఉంది. అమ్మాయి తన కుటుంబంలో దెబ్బతిన్న బంధాలను చూశారు. దీంతో ఆమె భావోద్వేగపరంగా ఎక్కువ రక్షణను కోరుకున్నారు. మరోవైపు, ఆ అబ్బాయి హింసాత్మక వాతావరణాన్ని చూశారు. దీనివల్ల ఆయనలో వేరే ఇబ్బందులు ఉన్నాయి. భావోద్వేగపరంగా అభద్రతాభావంతో ఉన్న ఈ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారి మధ్య అనుబంధం ఏర్పడింది కానీ, పరస్పర అవగాహన కుదరలేదు. నెమ్మదిగా ఆ బంధంలో ఒత్తిడి, అవిశ్వాసం పెరిగాయి. ఆ అబ్బాయి వైపు నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
'వైవాహిక ఒత్తిడి కేసులు ఎక్కువ'
బీబీసీ ఈ విషయమై దిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది మనీష్ భదౌరియాతో కూడా మాట్లాడింది. అధికారిక గణాంకాలు లేకపోయినప్పటికీ, కుటుంబ, వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసులు నిరంతరం పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
"దాదాపు ప్రతి ఫ్యామిలీ లాయర్ వద్ద వైవాహిక కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నా వద్దకు వచ్చే కేసులలో కూడా ఎక్కువ భాగం పెళ్లి, బంధాలకు సంబంధించిన వివాదాలే" అన్నారాయన.
"చాలాసార్లు పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ, కొద్దికాలంలోనే చట్టపరమైన వివాదాల వరకు వెళ్లిన కేసులు కూడా వస్తుంటాయి" అన్నారు.
చాలా కేసులలో ప్రజలు నిరంతరం ఘర్షణలను ఎదుర్కొంటూనే ఉంటారని, దీని ప్రభావం వారి మానసిక స్థితిపై పడుతుందని మనీష్ భదౌరియా అభిప్రాయపడ్డారు.
"జీవనశైలి, ఒకరిపై ఒకరికి ఉండే అంచనాలలో వ్యత్యాసాలు కూడా బంధాలలో ఒత్తిడికి పెద్ద కారణం అవుతున్నాయి. చాలాసార్లు ఇద్దరూ జీవితాన్ని వేర్వేరు మార్గాల్లో జీవించాలని అనుకుంటారు. ఆ తేడానే మున్ముందు విడిపోవడానికి దారితీస్తోంది" అన్నారు.
'సమాజం మారితే ఒత్తిడి కూడా పెరుగుతుంది'
ఆత్మహత్యల మొత్తం కేసులలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళల మానసిక వేదన మరో రూపంలో కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.
మిరాండా హౌస్ కాలేజీలో సోషియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెసర్ రీమా భాటియా ఒక యువతి ఉదాహరణను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ అమ్మాయి ఐఐటీలో చదువుకుని, జర్మనీలో ఉద్యోగం చేస్తూ ఎన్నేళ్లుగానో అక్కడే ఉంటోంది, అయినప్పటికీ ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలలో ఇంటి పనులకు సంబంధించిన అంచనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అని చెప్పారు.
"మన దేశంలో వివాహం అనేది ఇప్పటికీ ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. చాలామంది పెళ్లి చేసుకుంటారు. చాలా వరకు దీనిని విజయానికి కొలమానంగా భావిస్తారు. కానీ, సమస్య ఏమిటంటే.. పెళ్లి విషయంలో పురుషులు, మహిళలు ఇద్దరి అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి" అని రీమా భాటియా అన్నారు.
"అమ్మాయిలు ముందుకు దూసుకువెళుతున్నారు, చదువుకుని బయట ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, పెళ్లి తర్వాత వారి నుంచి ఇంటి పనులకు సంబంధించిన అంచనాలు కూడా పెట్టుకుంటున్నారు. పురుషులు ఆ స్థాయిలో వారితో సమానంగా అడుగులు వేయలేకపోతున్నారు" అన్నారామె.
ఫ్రెంచ్ సోషియాలజిస్ట్ ఎమిల్ దుర్ఖీమ్ రాసిన 'సూసైడ్- ఎ స్టడీ ఇన్ సోషియాలజీ' పుస్తకాన్ని ప్రొఫెసర్ భాటియా ప్రస్తావిస్తూ, "ఎప్పుడైతే సమాజం పరిణామం (ఇవాల్వ్) చెందుతుందో అప్పుడు ఆత్మహత్యలు పెరుగుతుంటాయి" అని వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)