బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ రివ్యూ: చాలా గ్యాప్ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, T-Series
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 3 నిమిషాలు
నాగశౌర్యకి చాలా కాలంగా హిట్ లేదు. బాగా గ్యాప్ తర్వాత బ్యాడ్‌బాయ్ కార్తీక్‌గా వచ్చాడు. ఎలాంటి ప్రమోషన్స్ , ప్రచారం లేకుండా వచ్చిన ఈ సినిమా ఎలా వుంది?
కథ ఏమంటే కార్తీక్ (నాగశౌర్య) , కస్తూరి (శ్రీదేవి) అక్కాతమ్ముడు. అక్క అంటే తమ్ముడికి ప్రాణం. ఈగ వాలినా సహించడు. తమ్ముణ్ని అమెరికా పంపాలని అక్క కోరిక.
అయితే ఆమెని వదిలి వెళ్లడం హీరోకి ఇష్టం లేదు. ఏదో ఒక కేసులో ఇరుక్కుంటే వీసా రిజెక్ట్ అవుతుందని, ఏసీపీ సాయికుమార్ కూతురు విధి యాదవ్ వెంటపడతాడు.
వైజాగ్‌లో లాయర్‌గా పని చేస్తున్న శ్రీదేవి తమ్ముడికి తెలియకుండా అనంతపురం వెళ్తుంది. కదిరిలో వున్న ఫ్యాక్షన్ నాయకుడు గోవిందప్ప చేస్తున్న అక్రమాల గురించి జడ్జికి ఫిర్యాదు చేస్తుంది. తర్వాత జడ్జి హత్య జరుగుతుంది.
గోవిందప్ప, అతని మనుషులు లాయర్‌ని వెతుకుతూ వైజాగ్ వస్తారు. అక్క ప్రమాదంలో వుందని తమ్ముడికి తెలిసి ఎలా కాపాడుకుంటాడు? కదిరికి ఎందుకొస్తాడు? గోవిందప్ప ప్రత్యర్థి వరదారెడ్డి ఎవరు? వీళ్లిద్దరితో శ్రీదేవికి వైరం ఎందుకు? ఇదంతా మిగతా కథ.


ఫొటో సోర్స్, T-Series
ఇది నిజానికి 20 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా. కొంచెం ఆలస్యంగా వచ్చింది.
నాగశౌర్య బబ్లీ బాయ్‌గా బాగుంటాడుగానీ, కత్తులతో వెంటపడే యాక్షన్ హీరోగా చూడడమే కష్టం. ఈ కథలో ఏముందని నటించాడో నాగశౌర్యకే తెలియాలి.
సినిమాలో సముద్రఖని, నరేశ్, మైమ్ గోపి, అజయ్, వెన్నెల కిశోర్, సుదర్శన్ లాంటి మంచి నటులున్నారు. అందరూ రొటీన్‌గా చేసుకుపోయారు.
కథలో ఎక్కడా ఎలివేషన్, హైప్ లేకపోతే ఎంతటి నటుడైనా తేలిపోతాడు. సాయికుమార్‌ది కామెడీ క్యారెక్టరో, సీరియస్సో కూడా అర్థం కాదు. హీరోయిన్ కేవలం పాటల కోసమే.
హీరో ఫైట్, ఇంట్రో సాంగ్, లవ్ ట్రాక్, రెండు డ్యూయట్స్, విలన్ ఎంట్రీ, ఒక భారీ యాక్షన్ సీన్‌తో ఇంటర్వెల్. ఈ ఫార్మట్ ఇప్పుడు వర్కౌట్ కాదు.
ప్రేక్షకుడు కమర్షియల్ సినిమాలో భారీ థ్రిల్స్, ఊహకందని సన్నివేశాల్ని కోరుకుంటున్నాడు.
విలన్ ఆట కట్టించడానికి కమెడియన్‌ని క్లైమాక్స్‌లో తీసుకురావడం శీను వైట్ల కాలంనాటి టెంప్లేట్.
వెన్నెల కిశోర్ ఎందుకున్నాడో మనకి అర్థం కాదు. ఈ సినిమాలో అతనికో డైలాగ్ వుంది. "స్టోరీ బానే వుంది కానీ, నెరేషనే నాన్ సింక్‌లో వుంది అని".
అయితే ఈ సినిమాలో స్టోరీ, నెరేషన్ రెండూ నాన్‌సింక్‌లోనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, T-Series
కొన్నిచోట్ల ఏదో నాటకం చూస్తున్నట్టు వుంటే అది మన తప్పు కాదు. దర్శకత్వంతో పాటు ఏ విభాగం గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇలాంటివి ఇంకో రెండు సినిమాలు చేస్తే నాగశౌర్యని మరిచిపోతారు.
ప్లస్ పాయింట్స్
ఏమీ లేవు
మైనస్ పాయింట్స్
రెండు గంటల 20 నిమిషాలు అవే
ఫైనల్‌గా ఇదో బ్యాడ్ మూవీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు.
సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నరసింహస్వామి ఉగ్రరూపం కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని చీల్చి చెండాడ్డానికి ఇదో ఉపమానం.
రాయలసీమ వీధుల్లో కత్తులు, కొడవళ్లు తీసుకుని నరుక్కుంటారని ఇంకెంత కాలం చూపుతారు సామి.
(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































