పార్వతీపురం-మన్యంజిల్లా: ‘చిల్లంగి’ చేస్తున్నాడనే ఆరోపణలతో యువకుడి హత్య, ఈ కేసులో అసలేం జరిగింది?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

పార్వతీపురం-మన్యం జిల్లాలో చిల్లంగి (మంత్రాలతో ఇతరులకు హాని కలిగించడం) చేస్తున్నాడన్న ఆరోపణలతో గ్రామంలో కొందరు ఒక వ్యక్తిని హత్య చేసినట్టు పార్వతీపురం రూరల్ పోలీసులు బీబీసీకి తెలిపారు.

ఈ ఘటన బయటపడకుండా మృతదేహాన్ని దహనం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, అరెస్టైన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

''పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో 30 ఏళ్ల తాడంగి రమేశ్‌ను చిల్లంగి (చేతబడి) చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు సోమవారం (జూన్ 1) తీవ్రంగా కొట్టారు. ఆ దాడిలో రమేశ్ మరణించగా విషయం బయటకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటనపై మాకు సమాచారం అందడంతో బాగా కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అనంతరం గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేశాం'' అని పార్వతీపురం రూరల్ ఎస్.ఐ.రాజేశ్ బీబీసీతో చెప్పారు.

ఈ ఘటనపై లోతుగా విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

అయితే, గత కొన్ని రోజులుగా తన భర్తకు బెదిరింపులు వస్తున్నాయని మృతుడి భార్య సృజన ఆరోపించారు.

24 గంటల్లో 16 మంది అరెస్టు…

ఈ ఘటనపై మృతుడి సోదరుడు శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో కొందరిని అరెస్టు చేశారు.

హత్య కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి వెల్లడించారు.

"వెలగవలస గ్రామంలో 300మంది ఉంటారు. వీరంతా జీవనోపాధి కోసం పోడు వ్యవసాయం చేస్తున్నారు. గ్రామంలో మరింతమందిని ఈ కేసులో విచారిస్తున్నాం. చిల్లంగి పేరుతో జరిగిన ఈ హత్య వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం'' అని ఆమె బీబీసీకి తెలిపారు.

గ్రామంలో 'వింత వ్యాధి' భయమా?

వెలగవలస గ్రామంలో గత రెండు నెలలుగా అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

జ్వరం, జలుబు, దగ్గుతో పాటు కొందరిలో అసాధారణ ప్రవర్తన కనిపిస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు పెరిగాయి.

వైద్య సదుపాయాలు సరిగా అందుబాటులో లేకపోవడంతో చాలామంది నాటువైద్యం, స్థానిక మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసి వాడుతున్నట్టు గ్రామస్థులు రాంబాబు, సోము బీబీసీతో చెప్పారు.

ఇటీవల గ్రామానికి చెందిన యువతి అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు.

ఇదేదో కొత్త రకమైన వ్యాధి కావచ్చని కొందరు గ్రామస్థులు అనుమానిస్తున్నారని, మరికొందరు ‘చిల్లంగి’ కారణమని భావిస్తున్నారని రాంబాబు చెప్పారు.

గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, చేతబడుల ద్వారా ఇతరులకు అనారోగ్యం లేదా కీడు కలిగిస్తారని, దానిని స్థానికంగా ‘చిల్లంగి’ అంటారనీ, అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

"వ్యాధులకు చేతబడి కారణం కాదు"

ఈ ఘటనపై మానసిక ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో ఒకేసారి చాలామంది అనారోగ్యానికి గురైతే, దానికి ఆరోగ్యపరమైన కారణాలను పరిశీలించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, కలుషిత నీరు, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉండొచ్చని సైక్రియాటిస్ట్ డాక్టర్ ప్రవీణ బీబీసీతో అన్నారు.

వ్యాధులు లేదా అసాధారణ ప్రవర్తనకు చేతబడి, చిల్లంగి వంటి మూఢనమ్మకాలే కారణమని భావించడం ప్రమాదకరమని హెచ్చరించారు.

దశాబ్దాలుగా గిరిజనులు మూఢనమ్మకాలను విడిచిపెట్టడం లేదని భారత నాస్తిక సంఘం అంటోంది. భారత నాస్తిక సమాజం విశాఖ జిల్లా అధ్యక్షుడు వై. నూకరాజు ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడారు.

"గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో చాలామంది నష్టపోతూనే ఉన్నారు. భూ వివాదాలు లేదా కుటుంబ విభేదాలు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని చిల్లంగి పేరుతో వెలివేయడం, దాడులు చేయడం, కొన్నిసార్లు హత్యలూ చేస్తున్నారు" అని బీబీసీతో అన్నారు నూకరాజు.

అలాంటి ఘటనలను పోలీసులు, జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా గమనించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

"మూఢనమ్మకాల పేరిట గుంపులుగా ఏర్పడి దాడులు చేయడం, హత్యలకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఈ ఘటన నేపథ్యంలో ఏఎస్పీ మనీషా రెడ్డి హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)