మహిళా ఉద్యోగులపై రేప్, లైంగిక వేధింపుల ఆరోపణలతో టీమ్‌లీడర్లు, సీనియర్ ఉద్యోగుల అరెస్ట్.. హెచ్ఆర్‌పై కూడా కేసు.. అసలు విషయమేంటి?

నాసిక్, మల్టీనేషనల్ కంపెనీ, లైంగిక వేధింపులు, రేప్, మహిళలు
    • రచయిత, ప్రవీణ్ థాకరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని, బలవంతపు మతమార్పిళ్లకు ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగుచూసింది.

కంపెనీలో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు స్థానిక దేవలాలీ పోలీస్ స్టేషన్‌లో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత 3 నుంచి 4 ఏళ్లుగా ఇవి జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి.

బాధిత మహిళలను మతం మారాలని ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులు ఉన్నత విద్యావంతులు, అదే కంపెనీలో టీమ్ లీడర్లుగా పనిచేస్తున్నారు.

ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను నిర్లక్ష్యం చేసిందని, ఇది ఒకరకంగా కార్పొరేట్ జిహాద్ కాదా? అని స్థానిక బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ హెచ్‌ఆర్‌పై కేసు

బాధితులు ఈ విషయమై కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి కూడా ఫిర్యాదులు చేశారు. కానీ, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో పుణెలోని ఆ కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి చెందిన మహిళా ఉద్యోగిపై కూడా కేసు నమోదైంది.

బాధిత 8 మంది మహిళలు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కంపెనీలో సీనియర్ స్థానాల్లో ఉన్నారు. వారిలో కొందరు కంప్యూటర్ ఇంజనీర్లు కాగా, మరికొందరు టీమ్ లీడర్లుగా ఉన్నారు.

ఆఫీసులో బాధిత మహిళలను అసభ్యంగా తాకడం, వారి శరీరాకృతి, దుస్తుల గురించి కామెంట్ చేయడం, వారి మతాన్ని కించపరచడం వంటి చర్యలకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలున్నాయి.

అలాగే, బాధిత మహిళలతో మాంసాహారం తినాలని ఒత్తిడి చేసేవారని, మతమార్పిడికి సిద్ధం చేసేలా మానసిక ఒత్తిడి ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

నాసిక్, మల్టీనేషనల్ కంపెనీ, లైంగిక వేధింపులు, రేప్, మహిళలు
ఫొటో క్యాప్షన్, సందీప్ మిట్కే, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నాసిక్ సిటీ

రేప్, లైంగిక వేధింపుల కేసులు నమోదు

మహిళలనే కాకుండా ఒక పురుష ఉద్యోగిని కూడా మతం మారాలంటూ మానసికంగా ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

పోలీసులు భౌతిక, సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నారు.

నిందితులపై రేప్, లైంగిక వేధింపులు, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి సెక్షన్ల కింద ముంబయి నాకా, దేవలాలీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వివాహితుడు. ప్రేమపేరుతో మోసం చేసి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదు చేసిన మహిళలు 18 నుంచి 25 ఏళ్ల వయస్సు వారు, మధ్యతరగతికి చెందినవారు. 2022 నుంచి ఈ వేధింపులు సాగుతున్నాయని బాధితులు చెబుతున్నారు.

నాసిక్, మల్టీనేషనల్ కంపెనీ, లైంగిక వేధింపులు, రేప్, మహిళలు

'ప్రభుత్వ పర్యవేక్షణ లోపించింది'

బీబీసీ మరాఠీతో మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి అజిత్ చవాన్, ఇది 'కార్పొరేట్ జిహాద్' కాదా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ కంపెనీల వ్యవహారాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ తక్కువగా ఉందని ఆయన ఆరోపించారు.

"ప్రైవేట్ కంపెనీలు వచ్చినప్పుడు మనం వాటిని ఆహ్వానిస్తాం. ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉపాధిని కల్పిస్తాయి. కానీ, అక్కడి ఉద్యోగులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటే, అది కేవలం కంపెనీల తప్పు మాత్రమే కాదు, పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమే" అన్నారు అజిత్ చవాన్.

నాసిక్, మల్టీనేషనల్ కంపెనీ, లైంగిక వేధింపులు, రేప్, మహిళలు
ఫొటో క్యాప్షన్, నిందితుల తరఫు లాయర్ బాబా సయ్యద్

ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం

ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. మహిళల భద్రత విషయంలో ప్రైవేట్ కంపెనీలు తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సందీప్ మిట్కే సూచించారు.

"ఈ కంపెనీలో మహిళలపై లైంగికంగా, మానసికంగా వేధించడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి పలు ఆరోపణలపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. కేసు సున్నితత్వాన్ని బట్టి పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశాం" అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అన్నారు.

"ఇది చాలా సున్నితమైన అంశం. ఎఫ్.ఐ.ఆర్ పూర్తి ప్రతి మాకు ఇంకా అందలేదు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం నమోదు చేసిన సెక్షన్లకు గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. ఎఫ్.ఐ.ఆర్ చూసిన తర్వాతే మతమార్పిడి అంశంపై స్పష్టత వస్తుంది" అని నిందితుల తరపు లాయర్ బాబా సయ్యద్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)