భారత ‘రాకెట్ ఉమన్’ ధరించిన చీర అమెరికా మ్యూజియంలో...

ఫొటో సోర్స్, Smithsonian’s National Air and Space Museum
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
భారత అంతరిక్ష శాస్త్రవేత్త నందిని హరినాథ్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుగా అభివర్ణించే ఆ రోజున ఎరుపు-నీలం రంగు సిల్క్ చీర కట్టుకుని ఆఫీసుకు వచ్చారు.
అదే చీరకు ఇప్పుడు వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్స్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రముఖ స్థానం లభించింది.
భారత తొలి మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని, 2013 డిసెంబర్ 1న ఆ చీరను ధరించారు.
కీలకమైన పనిరోజుల్లో లేదా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ప్రాతినిధ్యం వహించే సందర్భాల్లో నందినికి చీరలు, ముఖ్యంగా తండ్రి బహూకరించినవి ధరించడం అలవాటు.
అందుకే ఆ ప్రాజెక్టుకు ''అత్యంత కీలకమైన ఆ రోజున'' ఆమెకు చీరే సహజమైన ఆప్షన్‌గా మారింది.


అంతరిక్ష నౌకను భూకక్ష్య నుంచి బయటకు పంపి, మార్స్ వైపు 300 రోజుల ప్రయాణానికి సాగనంపేందుకు నందిని సహా ఇస్రో శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్‌లో సిద్ధంగా ఉన్నారు.
''అది చావోరేవో తేల్చుకోవాల్సిన క్షణం. మిషన్‌లో అత్యంత కీలకమైన పని అది'' అని నందిని 2016లో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
''అంతరిక్ష నౌక ఎక్కడకు వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి అన్నది మేమే నిర్ణయించాల్సి వచ్చింది. ఆ రోజున మేం చేసిన పనిపైనే మిషన్ విజయం ఆధారపడి ఉంది'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Smithsonian’s National Air and Space Museum
మంగళయాన్‌ను 2014 సెప్టెంబర్ 24న విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
ఆ రోజున ఇస్రోలో చీరలు ధరించిన మహిళలు సంబరాలు చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నందిని సహా ఇతర మహిళా అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో భారతదేశంలో రాకెట్ శాస్త్రం మగవారికే పరిమితమన్న మూస ధోరణికి సవాల్ ఎదురైంది.
అయితే ఆ ఫోటోలో కనిపించిన మహిళలు అడ్మినిస్ట్రేషన్‌కు చెందినవారని, మిషన్‌పై పనిచేసిన పలువురు మహిళా శాస్త్రవేత్తలు ఆ సమయంలో కంట్రోల్ రూమ్‌లో ఉన్నారని ఇస్రో తరువాత స్పష్టం చేసింది.
ఆ ఫోటో ''కట్టిపడేసేలా'' అనిపించిందని స్మిత్సోనియన్ మ్యూజియంలోని అంతరిక్ష చరిత్ర క్యూరేటర్ మ్యాట్ షిండెల్ అమెరికా నుంచి బీబీసీకి ఫోన్లో చెప్పారు.
''ఈ కీలకమైన మిషన్‌లో ముందుండి పనిచేసిన ఈ 'రాకెట్ ఉమెన్' కథ చెప్పాల్సిన గొప్ప కథగా నాకు అనిపించింది'' అని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో 2020లో షిండెల్ ఈ-మెయిల్ ద్వారా నందినిని సంప్రదించారు. భారత మార్స్ మిషన్‌ను, అందులో ఆమె పాత్రను ప్రతిబింబించే వస్తువు ఏదై ఉంటుందనే అంశంపై ఇద్దరూ చర్చలు ప్రారంభించారు.
''ప్రదర్శనలో భాగంగా ఉంచేందుకు ఆమె ఏ వస్తువును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అడిగాను. మంగళయాన్ భూ కక్ష్యను వీడిన రోజు ఆమె ధరించిన చీరే సరైన ఆప్షన్ అని మేమిద్దరం అంగీకరించాం'' అని షిండెల్ చెప్పారు.
చీరతోపాటు దానికి జతగా ఉన్న నీలం రంగు జాకెట్ మ్యూజియానికి చేరిన తరువాత, దాన్ని బొమ్మకు ఎలా ధరింపచేయాలనే విషయం తెలుసుకోవడానికి వస్త్ర సంరక్షణ నిపుణురాలు బెత్ నైట్ యూట్యూబ్ వీడియోలు చూశారు.
ముఖ్యమైన మిషన్ల సమయంలో ధరించిన ఇతర దుస్తులతో ఈ చీరకు కూడా ఒక రకమైన పోలిక ఉందని షిండెల్ చెబుతున్నారు. 1970లో అపోలో-13 వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి చేపట్టిన చర్యల్లో నాసా ఫ్లైట్ కంట్రోల్ చీఫ్ జీన్ క్రాంజ్ ధరించిన ప్రసిద్ధ వెస్ట్ కూడా తమ కలెక్షన్లో ఉందని ఆయన చెప్పారు.
ప్రతి వారం వేలమంది సందర్శించే స్మిత్సోనియన్ మ్యూజియంలో భారత్‌కు సంబంధించిన అనేక వస్తువులు ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ భాగం భారత వైమానిక దళం, విమానయాన సంస్థలకు సంబంధించినవే.
సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సీ క్లార్క్‌కు ఆయన 90వ జన్మదినం సందర్భంగా 2007లో ఇస్రో బహూకరించిన వెండి జ్ఞాపిక కూడా అక్కడ ఉంది.
''కానీ మా ఇంటర్‌ప్లానెటరీ సైన్స్ కలెక్షన్ కోసం భారత్ నుంచి సేకరించిన తొలి వస్తువు నందిని చీరే. అలాగే మా కలెక్షన్లోని తొలి చీర కూడా ఇదే'' అని షిండెల్ చెప్పారు.
చీర ఓ సాంస్కృతిక గుర్తింపు
ఈ చీరను ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలోని 'ఫ్యూచర్స్ ఇన్ స్పేస్' గ్యాలరీలో బొమ్మలు, ఆటలు, సినిమా పోస్టర్లతో పాటు ప్రదర్శనలో ఉంచారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి అమెరికన్ మహిళగా గుర్తింపు పొందిన సాలీ రైడ్ 1983లో షటిల్ మిషన్ సందర్భంగా ధరించిన ప్రసిద్ధ నీలం రంగు టీ-షర్ట్ పక్కనే దీనిని ఉంచారు.
''ఇటీవలి కాలంలో అంతరిక్షంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగవచ్చనే అంశాలపై సందర్శకుల్లో ఆసక్తి రేకెత్తించడమే ఈ ప్రదర్శన ఉద్దేశం'' అని షిండెల్ చెప్పారు.
''అంతరిక్షానికి సంబంధించి మనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అంతరిక్షంలోకి ఎవరు వెళ్లాలో ఎవరు నిర్ణయిస్తారు? మనం అక్కడికి ఎందుకు వెళ్లాలి? అక్కడికి వెళ్లిన తరువాత ఏమి చేయాలి? వంటి ప్రశ్నలపై ఆలోచించేందుకు ఈ ప్రదర్శన సందర్శకులను ఆహ్వానిస్తుంది'' అని ఆయన అన్నారు.
‘‘అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లాలి, దాని వెనుక ఉన్న ప్రేరణ ఏమిటన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ ప్రదర్శన’’ అని షిండెల్ చెప్పారు.
నందిని చీర రెండు ముఖ్యమైన సందేశాలను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
''మొదటిది, భారత తొలి మార్స్ మిషన్, దేశ అంతరిక్ష కార్యక్రమంపట్ల భారతీయుల గర్వానికి ఇది ప్రతీక. రెండోది, నందిని వ్యక్తిగత విజయగాథ. ఆమె సాధించిన విజయం మరింతమంది మహిళలను సైన్స్ రంగంలో కెరీర్‌ను ఎంచుకునేలా ప్రేరేపించగలదు'' అని ఆయన వివరించారు.
చీరకు ఉన్న సాంస్కృతిక విలువ, దాన్ని సులభంగా గుర్తించగలగడం కూడా దాని ఎంపికకు కారణాలని ఆయన చెప్పారు. ప్రదర్శనలోని వస్తువుల గురించి సందర్శకులు టచ్‌స్క్రీన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
''చీరను చూసి దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి సందర్శకుల్లో కనిపించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా కలెక్షన్‌కు ఇది ఒక అద్భుతమైన జోడింపు'' అని షిండెల్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































